నాగోల్‌లో కాల్పుల కలకలం.. బంగారు నగల దోపిడి
Thieves opened fire while looting gold shop in Nagole.హైదరాబాద్ నగరంలోని నాగోల్‌లో కాల్పులు కలకలం రేపాయి.
By తోట వంశీ కుమార్
హైదరాబాద్ నగరంలోని నాగోల్‌లో కాల్పులు కలకలం రేపాయి. స్నేహపురి కాలనీలోని ఓ జువెలరీ షాపులోకి చొరబడిన దుండగులు కాల్పులు జరిపి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అడ్డుకోబోయిన షాపు యజమానితో పాటు బంగారం వ్యాపారి తీవ్రంగా గాయపడ్డారు.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కల్యాణ్ చౌదరి 15 ఏళ్ల కిందట నగరానికి వచ్చాడు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్నేహపురి కాలనీలో 11 ఏళ్లుగా మహదేవ్ జ్యుయెలర్స్ పేరిట బంగారు, వెండి ఆభరాల షాపును నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో షాపును మూసి వేయడానికి సిద్ధం అవుతుండగా ఆభరణాల వ్యాపారి అయిన రాజ్‌కుమార్ సురానా సుఖ్‌దేవ్ సికింద్రాబాద్ నుంచి బంగారాన్ని తీసుకువచ్చాడు. అప్పటికే ముగ్గురు కస్టమర్లతో కల్యాణ్ చౌదరి మాట్లాడుతున్నారు.
అదే సమయంలో నలుగురు దుండగులు రెండు బైక్‌లపై వచ్చారు. మహాదేవ్ షాపుకు కొద్ది దూరంలో బైక్‌లను ఆపారు. ఇద్దరు వ్యక్తులు షాపులోకి చొరబడి తుపాకితో కస్టమర్లను బెదిరించి బయటకు పంపించి వేశారు. షట్టర్ మూసివేశారు. వ్యాపారి సుఖ్‌దేవ్ తీసుకువచ్చిన బంగారంతో పాటు షాపులోని ఆభరణాలు ఇవ్వాలని వారిని బెదిరించారు. ఈ క్రమంలో నలుగురి మధ్య పెనుగులాట జరిగింది. దుండగులు కాల్పులు జరపడంతో సుఖ్‌దేవ్‌తో పాటు కల్యాణ్‌కు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
పక్కా పథకం ప్రకారమే..
దుండగులు పక్కా ప్లాన్ ప్రకారమే దోపిడి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రతి గురువారం వ్యాపారి సుఖ్‌దేవ్ కల్యాణ్ షాపుకు వచ్చి బంగారం ఇస్తుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న దుండగులు సుఖ్‌దేవ్‌ను అనుసరించి దోపిడీకి పాల్పడ్డారు.