రేపు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న పోలీస్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు ఇవే.!

These are the special features of the Command Control Center to be inaugurated by CM KCR tomorrow. హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్ రోడ్‌ నెంబర్ 12లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్

By అంజి  Published on  3 Aug 2022 10:41 AM GMT
రేపు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న పోలీస్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు ఇవే.!

హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్ రోడ్‌ నెంబర్ 12లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా...కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీస్ టవర్స్‌ను నిర్మించారు. వందలాది మంది కార్మికులు మెయిన్‌ గేట్‌ దగ్గర డివైడర్లు, అలాగే పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తున్నారు. సాయంత్రానికి పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

రేపు సీసీసీ ప్రారంభోత్సవం తర్వాత.. 18వ అంతస్తులో ఉన్న హైదరాబాద్ కమిషనర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆ తర్వాత మ్యూజియంని కూడా ప్రారంభిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావించారని.. వారి ఆలోచనల మేరకు అద్భుతమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ రూపకల్పన జరిగిందన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని డిపార్ట్మెంట్‌లకు సంబంధించిన అధికారులను సమన్వయపరచడమేనని అన్నారు. ఇప్పటికే ఈ బిల్డింగ్‌కు తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేడెట్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌గా నామకరణం చేశారు. ఇది పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ బిల్డింగ్.


కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఫీచర్లు...

సీసీసీ నిర్మాణం అన్ని విభాగాల సమన్వయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టబడింది. కమాండ్ కంట్రోల్‌లో మొత్తం ఐదు టవర్లు ఉన్నాయి. టవర్ ఏ ఇరవై అంతస్తులు కలిగి ఉండగా, ఇందులో సిటీ పోలీస్ కమీషనర్ కార్యాలయం ఉంది. టవర్ ఏ పైన హెలిప్యాడ్ నిర్మాణం ఉంది. 15 అంతస్తుల టవర్ బీలో టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉంటుంది. టవర్ సి విషయానికి వస్తే.. ఇందులో మూడు అంతస్తులు ఉన్నాయి. పోలీసులు ఆడిటోరియంలా ఉపయోగించుకుంటారు. టవర్ డి మీడియా, శిక్షణా కేంద్రంగా ఉపయోగించబడుతుంది. ఈ మొత్తం కమాండ్, కంట్రోల్ సెంటర్‌లో ఏ, ఈ టవర్లు కీలకం. టవర్ ఈ లో కమాండ్ కంట్రోల్, డేటా సెంటర్, సీసీటీవీ నిఘా, వార్ రూమ్ ఉంటాయి. కమాండ్ కంట్రోల్ వద్ద ప్రత్యేక మ్యూజియం.. పోలీసు శాఖ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే అవకాశం ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హైదరాబాద్ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూచే వెసులుబాటు ఉంది.

కమాండ్‌ కంట్రోల్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రై కమిషనరేట్‌ పరిధిలోని ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. నేరం జరిగినా, ట్రాఫిక్‌ రద్దీ పెరిగినా క్షణాల్లోనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సాధారణ కెమెరాలతో పాటు, ఏఎన్‌పీఆర్‌ (ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రిజిస్ట్రేషన్‌) కెమెరాలను సీసీసీకి లింకప్‌ చేసి ఉండడంతో వేగంగా దర్యాప్తు జరుగుతుంది. దీంతో పాటు ఎవరైనా ఆపదలో ఉంటే నగరంలో ఎమర్జెన్సీ కాయిన్‌ బాక్స్‌ల నుంచి వీడియో కాల్‌ చేసి పోలీసుల సహాయం పొందవచ్చు. ఇక్కడి నుంచి పోలీసు సేవలతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అత్యవసర సమయాల్లో సేవలు అందిస్తారు.


తెలంగాణ వ్యాప్తంగా నిఘా

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. అయితే ఇందులో ప్రధానమైన హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని అన్ని ప్రాంతాలను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు నగరంలో ఏర్పాటైన 7.5 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఈ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. ఇందులో ప్రధానంగా ట్రాఫిక్‌, లా అండ్‌ అర్డర్‌, పండుగలు, వేడుకలు, రాజకీయ పార్టీలు, ఆందోళనలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. ఏ మూలన ఏం జరిగినా కంట్రోల్‌ సెంటర్‌కు నిమిషాల్లో తెలిసిపోతుంది.

ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు

నగరంలోని మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 250 ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రిజిస్ట్రేషన్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ సీసీసీకి అనుసంధానమై ఉంటాయి. దీని ద్వారా ట్రాఫిక్‌ రద్దీ ఎలా ఉంది.? ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడటానికి కారణాలేమిటి..? ఎంత సేపట్లో ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ అవుతుందనే విషయాలతో పాటు ట్రాఫిక్‌ మళ్లింపు, ఆంక్షలు, అనేక విషయాలను పబ్లిక్‌ అడ్రెసింగ్‌ సిస్టమ్‌ ద్వారా సీసీసీ నుంచి తెలియజేస్తారు. ఈ సదుపాయంతో రద్దీ ఎక్కువగా ఉండి, ట్రాఫిక్‌లో ఎక్కువ సేవు చిక్కుకోకుండా వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఏదైనా నేరం జరిగినా, దొంగ నంబర్లు వేసుకొని తిరిగే వాహనాలను ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు ఇట్టే క్యాప్చర్‌ చేస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్‌ను ట్రాఫిక్‌ పోలీసులకు అందిస్తాయి. ఆయా జంక్షన్ల నుంచి వచ్చే వాహనాలను లెక్కిస్తూ , ఎప్పటికప్పుడు డాటాను సీసీసీకి అందిస్తుంటాయి.

సోషల్‌ మీడియాకు స్పెషల్ వింగ్

సోషల్‌ మీడియాలో నిత్యం అసత్య ప్రచారాలు, పుకార్లు వస్తున్నాయి. ఇవి చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొన్ని పోస్టులు వర్గాలు, వ్యక్తుల మధ్య గొడవలు సృష్టించేవిగా ఉన్నాయి. ఇలాంటి పోస్టుల వల్ల శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది. కొందరు సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. వీటన్నింటికి చెక్‌ పెట్టేందుకు సీసీసీలో కొత్తగా సోషల్‌ మీడియా విభాగం ఉండబోతోంది. ఈ వింగ్‌ సోషల్‌మీడియాలో వచ్చే పోస్టులను ఎప్పకటిప్పుడు తెలుసుకుంటూ, చర్యలు తీసుకుంటుంది.


దొంగలు ఎటు వెళ్లినా దొరికిపోతారు

సీసీ కెమెరాలు ఒకే చోట ఉండటం, ఎక్కడైనా.., ఏదైనా ఘటన జరిగిందంటే వెంటనే సీసీసీ నుంచి స్థానిక పోలీసులకు కావాల్సిన సమాచారం ఇక్కడి నుంచి అందుతుంది. సీసీ కెమెరాల విశ్లేషణ చేస్తారు. కిడ్నాప్‌, ఇతరత్రా నేరాలు చేసి పరారవుతున్నారంటే వెంటనే మూడు పోలీస్‌ కమిషనరేట్ల పోలీసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు సీసీసీ నుంచి సందేశాలు వెళ్తాయి. దీంతో పాటు ఏ రూట్‌లో నుంచి కిడ్నాపర్లు, దొంగలు వెళ్లారనే సమాచారం తీసుకొని ఆ రూట్‌లోని కెమెరాలన్నింటినీ ఒకేసారి తనిఖీ చేస్తారు. దీంతో వేగంగా ఫలితాలు రావడంతో కేసుల దర్యాప్తు వేగంగా జరుగుతుంది. నేరం చేసి వెళ్లే వ్యక్తులకు సంబంధించిన వాహనం నంబర్‌ను గుర్తించారంటే, ఆ నంబర్‌ను సీసీసీకి పంపిస్తారు. దీంతో ఆ నంబర్‌ను సర్వర్‌లో ఉంచడంతో ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు ఉన్న చోట ఆ వాహనం వెళ్లిందంటే వెంటనే సీసీసీకి సమాచారం వస్తుంది. దీంతో స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి నేరస్తులను పట్టుకుంటారు. ఇదంతా నిమిషాల వ్యవధిలోనే జరుగుతుంది.

Next Story