హైదరాబాద్‌లోని పబ్‌లలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మ్యూజిక్, ఇతర సౌండ్‌లను నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి. సిటీ పోలీస్ యాక్ట్, సౌండ్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉందని హైకోర్టు పేర్కొంది. జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్, మరో ఇద్దరు వ్యక్తులు పబ్‌లు సరైన నియంత్రణ, నియమాలను పాటించడం లేదని, రాత్రిపూట శబ్దం పెంచుతున్నారని ఫిర్యాదు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పబ్‌లపై ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు ఆరోపించారు. పాఠశాలలు, నివాస ప్రాంతాల సమీపంలో పబ్‌లను ఎలా అనుమతిస్తారని కోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎక్సైజ్ శాఖకు హైకోర్టు ఆదేశించింది. అలాగే రాత్రిపూట మద్యం మాత్రమే విక్రయించాలని సూచించింది. పిటిషనర్ల తరుపున హైకోర్టు న్యాయవాది కైలాష్ నాథ్ వాదించారు. హైదరాబాద్‌లోని పబ్‌లపై దాఖలైన కేసుల వివరాలను సమర్పించాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.