తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎస్‌ సోమేశ్

Telangana rains: CS Somesh Kumar directs officials to be on high alert. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది.

By అంజి  Published on  26 July 2022 10:32 AM GMT
తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎస్‌ సోమేశ్

తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

హైదరాబాద్ శివార్లలోని జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లోకి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో మూసీ నది ప్రవాహాం పెరుగుతోందని కాన్పరెన్స్‌లో సోమేష్ కుమార్ ప్రస్తావించారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ కలిసి సమన్వయంతో పని చేయాలని, ఈ రిజర్వాయర్‌లలో నీటి ప్రవాహాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యుఎస్ అండ్‌ ఎస్‌బి) మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆయన కోరారు.

పునరావస కేంద్రాలను ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిందని, రిజర్వాయర్‌ల నుంచి విడుదలయ్యే వరద నీటి వల్ల నష్టపోయే ప్రజలను ఈ శిబిరాలకు తరలించాలని చెప్పారు. కాగా ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి నీటిని విడుదల చేయడంతో.. నగరంలోని నార్సింగి-మంచిరేవుల మధ్య రోడ్డు మార్గం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. హైదరాబాద్‌ నగరం నుంచి ప్రవహించే మూసీ నదిలోకి నీటిని విడుదల చేసేందుకు ఉస్మాన్ సాగర్ కుడి గేట్లను ఎత్తివేశారు.

సోమవారం అర్థరాత్రి కురిసిన భారీ వర్షం, మూసీలో ప్రవాహం పెరగడంతో ఇప్పటికే మూసారాంబాగ్ వంతెనపై వరద నీరు వచ్చి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాజ్‌వేలు, లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, ట్యాంకుల ఉల్లంఘనల విషయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. అధికారులందరూ తమ ప్రధాన కార్యాలయంలోనే ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన అన్నారు.

Next Story