గాంధీ ఆసుపత్రిలో ఫీజర్‌ బాక్సులపై పిల్‌.. కొట్టేసిన హైకోర్టు

గాంధీ ఆస్పత్రిలో 62 ఫ్రీజర్‌ బాక్సులున్నాయని ఆస్పత్రి సూపరింటిండెంట్‌ హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించారు. ఫ్రీజర్స్‌ అందుబాటులో ఉన్నందున విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది.

By అంజి  Published on  9 Nov 2023 10:04 AM IST
Telangana High Court, freezer boxes, Gandhi Hospital

గాంధీ ఆసుపత్రిలో ఫీజర్‌ బాక్సులపై పిల్‌.. కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపరిచేందుకు తగిన సంఖ్యలో కోల్డ్ స్టోరేజీ బాక్సులను ఏర్పాటు చేయడంలో తీసుకున్న చర్యలపై ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయడంతో తెలంగాణ హైకోర్టు సుమోటో తీసుకున్న పిల్‌ను కొట్టివేసింది. గాంధీ ఆస్పత్రి మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోయినట్లు వచ్చిన వార్త ఆధారంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌ కుమార్‌లతో కూడిన డివిజన్‌ ​​బెంచ్‌ స్వయంసిద్ధంగా పిల్‌ను విచారించింది.

మృతదేహాలను భద్రపరిచేందుకు ఆసుపత్రికి తగిన సంఖ్యలో కోల్డ్ స్టోరేజీ బాక్సులను అందించడంలో రాష్ట్రం తీసుకున్న చర్యలను వివరిస్తూ స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసినట్లు అడ్వకేట్ జనరల్ బండ శివానంద ప్రసాద్ కోర్టుకు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో 62 సీఎస్‌ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయని, అందులో 6 ఫ్రీజర్‌ బాక్స్‌లు మాత్రమే పని చేయడం లేదని ఏజీ కోర్టుకు నివేదించారు.

హైకోర్టు సుమోటో పిల్‌కు ముందు.. 60 పెట్టెలు ఉన్నాయి. వీటిలో 25 మాత్రమే పని చేస్తున్నాయి. దీంతో గాంధీ ఆస్పత్రిలో రోజూ 15 నుంచి 20 మృతదేహాలు కుళ్లిపోతున్నాయి అని వార్తా పత్రికలో కథనాలు వచ్చాయి. ఆస్పత్రి సూపరింటిండెంట్‌ సమర్పించిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం..ఫ్రీజర్స్‌ అందుబాటులో ఉన్నందున విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది.

Next Story