చట్టానికి ఎవరూ అతీతులు కారు.. హైడ్రా కమిషనర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్
అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట భూమికి సంబంధించి గతంలో ఇచ్చిన స్టేటస్ కో (యథాతథ స్థితి) ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు హైకోర్టు హైడ్రా కమిషనర్‌ను...
By - అంజి |
చట్టానికి ఎవరూ అతీతులు కారు.. హైడ్రా కమిషనర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్
హైదరాబాద్: అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట భూమికి సంబంధించి గతంలో ఇచ్చిన స్టేటస్ కో (యథాతథ స్థితి) ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు హైకోర్టు హైడ్రా కమిషనర్‌ను దోషిగా తేల్చింది. జూన్ 12న కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం.. అక్కడ కేవలం వరద నివారణ పనులు మాత్రమే చేపట్టాలని, భూమి స్వభావాన్ని మార్చకూడదని స్పష్టంగా పేర్కొంది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని కోర్టు గుర్తించింది.
కేవలం డ్రైనేజీ పనుల పేరుతో అక్కడ చిన్నారుల ఆటస్థలం, వాకింగ్ ట్రాక్, గార్డెన్, బోర్ వెల్స్ ఏర్పాటు చేయడంపై ధర్మాసనం మండిపడింది. ఆ ప్రాంతాన్ని ఏకంగా పార్కులా మార్చి, గేట్లు పెట్టి ప్రజల రాకపోకలను నియంత్రించడం కోర్టు ఉత్తర్వులను ప్రత్యక్షంగా ధిక్కరించడమేనని జస్టిస్ మౌషుమీ భట్టాచార్య, జస్టిస్ పి. మధుసూదన్ రావులతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.
"చట్టానికి ఎవరూ అతీతులు కారు"
హైడ్రా పనితీరుపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. "ఏ అధికారి కూడా చట్టానికి అతీతుడు కాదు" అని హెచ్చరిస్తూ, సదరు స్థలంలో హైడ్రా నియంత్రణను సూచించే బోర్డులు, ఇతర నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఆ స్థలాన్ని తిరిగి పాత స్థితికి తీసుకురావాలని ఆదేశిస్తూ, దీనిపై ఏప్రిల్ 27లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
మరోవైపు, హయాత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ కలాన్‌లోని 650 గజాల స్థలం విషయంలో హైడ్రా జోక్యాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూముల రక్షణ పేరుతో హైడ్రా తన పరిధిని మించి వ్యవహరిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యంగా కోర్టు విచారణలో ఉన్న భూముల విషయంలో హైడ్రా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఆమోదయోగ్యం కాదని హితవు పలికింది.
హైడ్రా పరిధిపై కోర్టు ప్రశ్నలు
మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జారీ చేసే మార్గదర్శకాలకు లోబడే కమిషనర్ పనిచేయాలని, సొంత నిర్ణయాలు తీసుకోకూడదని కోర్టు గుర్తు చేసింది. హైడ్రాపై వరుసగా పిటిషన్లు దాఖలవుతుండటం మరియు కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.