గన్‌ పార్క్‌ వద్ద గ్రూప్‌-2 అభ్యర్థుల ధర్నా, ఉద్రిక్త పరిస్థితులు

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  12 Aug 2023 1:45 PM IST
Telangana, Group-2 Exam, postpone demand, gunpark,

గన్‌ పార్క్‌ వద్ద గ్రూప్‌-2 అభ్యర్థుల ధర్నా, ఉద్రిక్త పరిస్థితులు

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద పలువురు గ్రూప్ -2 అభ్యర్థులు, పలు సంఘాలు నేతలు ధర్నా చేపట్టారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. గన్‌ పార్క్‌ వద్దకు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు, అఖిలపక్ష నాయకులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో.. రంగంలోకి దిగిన పోలీసులు పలువురు గ్రూప్‌-2 అభ్యర్థులు, నాయకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, గ్రూప్‌-2 అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది. దాంతో.. గన్‌ పార్క్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురుకుల టీచర్, పాలిటెక్నిక్‌ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల పరీక్షలు పూర్తైన తర్వాత గ్రూప్‌- 2 పరీక్ష నిర్వహించాలని కోరారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ ధర్నాలో పాల్గొనకుండా ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ దీక్షను ఇంట్లోనే కొనసాగిస్తున్నారు. భవిష్యత్‌ కోసం తెలంగాణ యువత చేస్తోన్న వీరోచిత పోరాటానికి సంఘీభావం తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. శాంతియుతంగా నిరసన తెలిపితే కేసీఆర్ ప్రభుత్వం తనని, తమ నాయకులను గృహ నిర్బంధం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాము సత్యాగ్రహాన్ని కొనసాగిస్తున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

మరోవైపు ఈ ధర్నాకు మద్దతు తెలిపిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాంను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన గన్‌పార్క్‌కు వెళ్లకుండా హైదరాబాద్‌ తార్నాకాలోని ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఈ సందర్బంగా మాట్లాడిన కోదండరాం.. గ్రూప్‌-2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమంగా అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ తప్పిదాలను నిరుద్యోగుల మీద నెట్టడం ఏమాత్రం సరికాదన్నారు కోదండరాం. ఒకేసారి మూడు రకాల పోటీ పరీక్షలు ఉండటం వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారని కోదండరాం తెలిపారు.

Next Story