ఈ సారి బోనాలకూ పిలవలేదు.. నాకిది కొత్తేమీ కాదు: గవర్నర్ తమిళిసై

రాజ్‌భవన్‌లో బోనాల వేడుకలు నిర్వహించిన గవర్నర్.. ఎప్పటిలాగే తెలంగాణ ప్రభుత్వం తరుఫున బోనాలకు పిలుపు రాలేదని చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  16 July 2023 3:55 PM IST
Telangana, Governor Tamilisai, Bonalu, Raj Bhavan,

ఈ సారీ బోనాలకు పిలవలేదు.. నాకిది కొత్తేమీ కాదు: గవర్నర్ తమిళిసై

చాలా కాలం నుంచి తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ తమిళిసై మధ్య సఖ్యత లేదు. గవర్నర్‌ తమిళిసైని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అన్ని కార్యక్రమాలకు దూరంగానే ఉంచుతోంది. హైదరాబాద్‌ నగరంలో ఘనంగా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం చేయాల్సిన అన్ని ఏర్పాట్లను చేసింది. అయితే.. బోనాలకు రావాలని.. తెలంగాణ సంప్రదాయం చూడాలని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు ఆహ్వానం పలకలేదు. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో బోనాల వేడుకలు నిర్వహించిన గవర్నర్.. ఎప్పటిలాగే తెలంగాణ ప్రభుత్వం తరుఫున బోనాలకు పిలుపు రాలేదని చెప్పారు. అందుకే రాజ్‌భవన్‌లో బోనాల వేడుకలు జరుపుతున్నట్లు తెలిపారు గవర్నర్ తమిళిసై.

బోనాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. లాల్‌ దర్వాజా బోనాల సందర్భంగా రాజ్‌భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో తమిళిసై బోనం సమర్పించి.. వడి బియ్యం పోశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని చెప్పారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు అందాలని అమ్మవారికి కోరుకున్నట్లు గవర్నర్ తమిళిసై చెప్పారు.

ప్రభుత్వం నుంచి బోనాల వేడుకల కోసం ఎలాంటి ఆహ్వానం తనకు అందలేదని గవర్నర్ తమిళిసై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినా ఇది తనకు కొత్తేమీ కాదు అని.. గత కొద్ది రోజులుగా ఇదే తంతు కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వ ఆహ్వానాలు అందినా, అందకపోయినా హ్యాపీగానే ఉంటానని చెప్పారు. తెలంగాణ ప్రజలకే తనకు పరివార్‌ అని అన్నారు గవర్నర్ తమిళిసై.

తెలంగాణ ప్రభుత్వ బిల్లుల ఆమోదం విషయంలో రేగిన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పెండింగ్‌ బిల్లులను ఆమోదిస్తానని తమిళిసై స్పష్టం చేసినా.. గవర్నర్ విషయంలో బీఆర్ఎస్ సర్కార్ తీరు మారలేదని తాజాగా తమిళిసై చేసిన వ్యాఖ్యలే చెబుతున్నాయి. ఇక ఇంతకు ముందున్న గవర్నర్ నరసింహన్‌కు బోనాలే కాదు ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలంటూ స్వయంగా సీఎం కేసీఆర్ వెళ్లి ఆహ్వానాలు పలికిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య దూరం ఎప్పుడు పోతుంది..? మున్ముందు ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయో అని పలువురు చర్చించుకుంటున్నారు.

Next Story