హైదరాబాద్: సికింద్రాబాద్ సృష్‌టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే వ్యవహారంలో తన తప్పేం లేదని యజమాని డా.నమ్రత అన్నారు. ఓ ఆర్మీ అధికారి తప్పుడు ఆరోపణల వల్లే తనపై కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. దీనికి సంబంధించి అన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. సరోగసీ రాకెట్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నమ్రతకు సికింద్రాబాద్ సివిల్ కోర్టు 5 రోజుల కస్టడీ విధించింది.
ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించనున్నారు. తాజాగా పోలీసులు వైద్య పరీక్షల తర్వాత అదుపులోకి తీసుకున్న సందర్భంగా మీడియాతో డా.నమ్రత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలీసుల వేధింపులను ఆరోపించారు. నమ్రతపై హ్యూమన్ ట్రాఫికింగ్‌తో పాటు పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిల్లలు లేని దంపతులను టార్గెట్‌గా చేసుకుని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు.