Hyderabad: మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థి సూసైడ్
హైదరాబాద్‌లో ఓ విద్యార్థి పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla
Hyderabad: మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థి సూసైడ్
క్షణికావేశంలో కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు వారివారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. విద్యార్థులు పరీక్షల్లో తాము ఆశించిన మార్కులు రాలేదని బాధపడతారు. ఇక కొందరు అయితే ఇక తాను బతికి ఉండి ఉపయోగం లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు గుండెకోతను మిగులుస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న అయ్యప్ప సొసైటీలో శ్రీకాళహస్తికి చెందిన విజయ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను నారాయణకాలేజ్ రామానుజన్ క్యాంపస్‌లో ఐఐటీ లాంగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఐఐటీ ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో విజయ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దాంతో.. తన రూములో ఎవరూ లేని సమయం చూసుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతర స్నేహితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కొడుకు మరణించాడన్న వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఇక తక్కువ మార్కులు రావడంతో చనిపోతున్నట్లు విజయ్ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.