హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ టీంపై, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కేసు వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ వెల్లడించారు. ఈ షోకు సినిమాలో నటించిన కీలక నటులు వస్తున్నట్లు అటు అల్లు అర్జున్ టీం, ఇటు థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు భద్రతా చర్యలు తీసుకోలేదన్నారు.
సంధ్య థియేటర్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీం పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 4, 2024న రాత్రి 9.40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేశారు. అక్కడకు ఊహించినదానికంటే అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. సినిమాలోని నటీనటులు హాజరవుతారన్న సమాచారం తమకు లేదని పోలీసులు తెలిపారు.