భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ అన్నారు. ఇందులో తమ ఏం లేదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. అలాగే టికెట్లకు సంబంధించిన వివరాలను రేపు చెబుతామన్నారు. మ్యాచ్ నిర్వాహణ అంటే అంత తేలికైన విషయం కాదని అన్నారు. జింఖానా గ్రౌండ్స్‌లో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో క్రీడశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం అజారుద్దీన్ మాట్లాడారు. హెచ్‌సీఎలో లోపాలను సవరించుకుంటామని, తెలంగాణకు మరింత ఖ్యాతి వచ్చేలా హెచ్‌సీఏ చర్యలు ఉంటాయని అన్నారు.
హైదరాబాద్ నగరంలోని జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రికత్త నెలకొంది. ఆదివారం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉప్పల్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జింఖానా మైదానంలో విక్రయించనట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. దీంతో టికెట్ల కోసం అభిమానులు అర్థరాత్రి నుంచే క్యూలైనల్లో బారులు తీరారు. టికెట్ల విక్రయం కోసం ప్యారడైజ్ కూడలి నుంచి జింఖానా వరకు క్యూ లైన్‌ను ఏర్పాటు చేశారు.
అయితే.. అంచనాలకు మించి అభిమానులు రావడంతో వాళ్లను నియంత్రించడం పోలీసులకు కష్టతరమైంది. ప్రధాన గేటు నుంచి అభిమానులు ఒక్కసారిగా తోసుకుని రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. టికెట్ల కోసం ఎగబడడంతో గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగింది. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఈ ఘటనలో 20 మందికి పైగా సృహ తప్పిపోయారు. కొందరు అభిమానులతో పాటు 10 మందికి పైగా పోలీసులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.