అవమానించారా లేక అనుమానించారా.. స్మిత సబర్వాల్ ట్వీట్ పై విమర్శలు
వికలాంగులను (పిడబ్ల్యుడి) సివిల్ సర్వీసెస్‌లోకి తీసుకోవడంలో హేతుబద్ధతను ప్రశ్నిస్తూ తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ ఉన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 July 2024 11:13 AM ISTఅవమానించారా లేక అనుమానించారా.. స్మిత సబర్వాల్ ట్వీట్ పై విమర్శలు
వికలాంగులను (పిడబ్ల్యుడి) సివిల్ సర్వీసెస్‌లోకి తీసుకోవడంలో హేతుబద్ధతను ప్రశ్నిస్తూ తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ ఉన్నారు. ఆమె వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
"స్మితా సబర్వాల్ ప్రకటన ఆమెకు వికలాంగుల పట్ల ఉన్న పక్షపాత ధోరణిని బహిర్గతం చేస్తుంది. బ్యూరోక్రసీలోని పెద్ద వర్గాలలోనూ.. ప్రభుత్వంలోని వివిధ శ్రేణులలో చాలా ప్రబలంగా ఉన్న కొందరి వ్యక్తుల మనస్తత్వాన్ని ఇది తెలియజేస్తోంది. వైకల్యాన్ని అసమర్థతగా భావిస్తున్నట్లు అనిపిస్తోందని.. వికలాంగులను తక్కువ చేసి చూపించే విధంగా ఉంది" అని NPRD జనరల్ సెక్రటరీ మురళీధరన్ వి అన్నారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సరైనవి కావని ఆయన విమర్శించారు.
గత కొద్దిరోజులుగా ఐఏఎస్ అధికారులు వికలాంగుల కోటాలో ఉద్యోగాలు సంపాదించారనే వివాదం నెలకొంది. దీనిపై స్మితా సబర్వాల్ స్పందిస్తూ.. ‘‘ఈ చర్చలో మరింత మంది పాల్గొంటూ ఉండగా.. దివ్యాంగులను గౌరవిస్తూనే.. విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం కలిగిన సర్జన్‌ను మీరు నమ్మగలరా? ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్‌లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుంది. ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరం. ఇలాంటి సర్వీసుల్లో అసలు ఈ కోటా ఎందుకు? నేను కేవలం అడుగుతున్నా’’ అని స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.
ఆమె ట్వీట్ కు NPRD సమాధానం:
స్మితా సబర్వాల్‌కు మురళీధరన్ సమాధానమిస్తూ.. “వికలాంగులకు రిజర్వేషన్లు ప్రతి వైకల్యానికి గుర్తించిన పోస్టులకు మాత్రమే. నిర్దిష్ట పోస్ట్‌లో బాధ్యతను నిర్వహించగల సామర్థ్యం ఆధారంగా గుర్తింపు జరుగుతుంది." అని అన్నారు. సర్జన్ల గురించి మురళీధరన్ మాట్లాడుతూ “అంగవైకల్యం ఉన్న సర్జన్లు చాలా మంది తమ వృత్తిలో విజయం సాధించారు. వారిలో ఒకరు ముంబైకి చెందిన ఆంకాలజిస్ట్ డాక్టర్ సురేష్ అద్వానీ." అంటూ వివరించారు.
ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు?
ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేశారన్న వివాదం దేశంలో సంచలనం రేపింది. పూజ ఖేద్కర్ దుష్ప్రవర్తనపై వివరణాత్మక, సమగ్ర దర్యాప్తు జరుపుతుందని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కమిషన్ కోరింది.