ఐరన్‌ ఓర్‌ వ్యాపారం పేరుతో మోసం..సిద్ధార్థ్‌ ఇంప్లెక్స్‌ యజమాని అరెస్ట్

ఐరన్‌ ఓర్‌ వ్యాపారం పేరుతో మోసం చేసిన సిద్ధార్థ్‌ ఇంప్లెక్స్‌ యజమానిని అరెస్ట్ అరెస్ట్ చేశారు.

By Srikanth Gundamalla
Published on : 7 July 2023 10:23 AM IST

Siddharth Impex Company, Delhi EOW, Arrest, Siddharth Reddy,

 ఐరన్‌ ఓర్‌ వ్యాపారం పేరుతో మోసం..సిద్ధార్థ్‌ ఇంప్లెక్స్‌ యజమాని అరెస్ట్

ఐరన్ ఓర్‌ సరఫరా చేస్తానని హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌కు చెందిన సిద్ధార్థ్‌ ఇంప్లెక్స్‌ సంస్థ యజమాని సిద్ధార్థ్‌ రెడ్డి భారీ స్కామ్‌కు స్కెచ్‌ వేశాడు. ఢిల్లీకి చెందిన కేర్‌ ప్రో బయోసైన్స్‌ (సీపీబీ) ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి ముడి ఇనుము సరఫర చేస్తానని రూ.6.57 కోట్లు తీసుకుని మోసం చేశాడు. దీంతో.. సదురు కంపెనీ ఢిల్లీ ఎకనమికల్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (ఈఓడబ్ల్యూ)కు ఫిర్యాదు చేసింది. దాంతో వారు హైదరాబాద్‌కు చేరుకుని సోదాలు చేశారు. ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా.. అబద్ధాలు చెప్పి సీపీబీ కంపెనీ నుంచి తీసుకున్న డబ్బు మొత్తాన్ని 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి సిద్ధార్థ్‌రెడ్డి ఓడిపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడని.. నిఘా పెట్టి ఎట్టకేలకు సిద్ధార్థ్‌రెడ్డిని అరెస్ట్‌ చేసినట్లు ఈఓడబ్ల్యూ అధికారులు తెలిపారు.

ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్‌ కేంద్రంగా పనిచేసే సీపీబీ సంస్థ ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం చేస్తుంది. చైనాకు చెందిన ఓ సంస్థకు 50వేల మెట్రిక్‌ టన్నుల ముడి ఇనుము సరఫరా చేసే కాంట్రాక్ట్‌ దక్కించుకుంది. ఈ విషయంలోనే సిద్ధార్థ్‌రెడ్డి ఢిల్లీలో సీపీబీ యాజమాన్యాన్ని కలిసి.. విశాఖలో తమకు గోదాంలు ఉన్నాయని చెప్పాడు. ముడి ఇనుము సిద్ధంగా ఉందని.. సరఫరా చేస్తానని నమ్మించాడు. దీనికి సంబంధించి కొన్ని బోగస్ ఫొటోలను కూడా చూపించాడు. దాంతో సిద్ధార్థ్‌రెడ్డిని సీపీబీ సంస్థ పూర్తిగా నమ్మింది. తొలి విడతగా రూ.6.57 కోట్లు హైదరాబాద్‌లోని సిద్ధార్థ్‌ ఇంప్లెక్స్‌ సంస్థకు చెందిన ఖాతాలోకి ఆర్టీజీఎస్‌ ద్వారా బదిలీ చేసింది.

ఐరన్ ఓర్‌ను చైనా తీసుకుళ్లేందుకు సీపీబీ సంస్థ ఏర్పాటు చేసిన ఓడ విశాఖ పోర్టుకు చేరుకుంది. కానీ.. సిద్ధార్థ్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు. అనుమానం వచ్చిన సీపీబీ ప్రతినిధులు ఆరా తీశారు. అక్కడున్న గోదాముల్లో ఏ ఒక్కటీ సిద్ఢార్థ్‌రెడ్డికి చెందినది కాదని తేలింది. దీంతో.. ధిత సంస్థ పోర్టు అధికారులకు డిటెన్షన్‌ అండ్‌ డెమరేజ్‌ చార్జెస్‌ కింద మరో రూ.1.77 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. సీపీబీ సంస్థ సిద్ధార్థ్‌రెడ్డి వల్ల మొత్తం రూ.9 కోట్లకు పైగా నష్టపోయింది. 2014లోనే సిద్ధార్థ్‌రెడ్డిపై బాధిత సంస్థ ఢిల్లీ ఈఓడబ్ల్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. నిందితుడికి అధికారులు ఎన్నోసార్లు నోటీసులు జారీ చేశారు. కానీ సిద్ధార్థ్‌రెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో.. ఢిల్లీ ఈవోడబ్ల్యూ అధికారులు సిద్ధార్థ్‌ను పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. చివరకు హైదరాబాద్‌లో నిఘా ఉంచి అమీర్‌పేట్‌ లీలానగర్‌లోని అద్దె ఇంటి నుంచి సిద్ధార్థను ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ తరలించి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు జడ్జి ఆదేశాలతో జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Next Story