షర్మిలతో భేటీ అయిన అజారుద్దీన్, సానియా మీర్జా కుటుంబ సభ్యులు
Sania Mirzas sister meets YS Sharmila.అజారుద్దీన్, సానియా మీర్జా కుటుంబ సభ్యులు షర్మిలతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.
By తోట వంశీ కుమార్
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని వైయస్ షర్మిల ప్రారంభించబోతుండడం రాజకీయంగా హీట్ ను పెంచుతూ ఉంది. వచ్చే నెల 9న ఖమ్మంలో నిర్వహించనున్న సభలో పార్టీని ఆమె ప్రకటించబోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో షర్మిలతో పలువురు ప్రముఖులు భేటీ అవుతున్నారు. అజారుద్దీన్, సానియా మీర్జా కుటుంబ సభ్యులు షర్మిలతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా దంపతులు వైఎస్ షర్మిలతో సమావేశమయ్యారు.
లోటస్‌పాండ్‌లో ఆమెను కలసి ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అజర్, సానియా కుటుంబ సభ్యులు షర్మిలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మర్యాదపూర్వకంగానే షర్మిలతో భేటీ అయినట్లు ఆనం మీర్జ, అసదుద్దీన్ దంపతులు తెలిపారు. పలువురు సెలెబ్రిటీలు షర్మిల పార్టీలో చేరే అవకాశం లేకపోలేదని అంటున్నారు. రాబోయే రోజుల్లో షర్మిల పార్టీపైనా.. పార్టీలో చేరే ప్రముఖుల విషయంలోనూ ఓ క్లారిటీ రానుంది. ఏప్రిల్ 9న ఖమ్మంలో వైఎస్ షర్మిల బహిరంగ సభను నిర్వహించనున్నారు. పార్టీని ప్రకటించడం.. పార్టీ పేరు వంటి ఎన్నో విషయాలనే కాకుండా.. పార్టీ కార్యాచరణ గురించి కూడా మాట్లాడబోతున్నారు. ఇలాంటి సమయంలో ఈ సభకు తెలంగాణ పోలీస్ శాఖ అనుమతినిచ్చింది. పెవిలియన్, ఎస్‌ఆర్&బిజిఎన్అర్ గ్రౌండ్‌లకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల ఇటీవల మాట్లాడుతూ తనపై ప్రచారం జరుగుతున్నట్టుగా, తాను టీఆర్ఎస్ పార్టీకో, బీజేపీకో, మరెవరికో బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. ఆ విధంగా ఉండాల్సిన అవసరం కూడా తనకు లేదని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల సాధన కోసమే తెలంగాణలో పార్టీ స్థాపిస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని అన్నారు.