కోఠి కాల్పుల కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు

కోఠి ఎస్బీఐ ద‌గ్గ‌ర జ‌రిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ రిన్షద్ ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే.

By -  Medi Samrat
Published on : 31 Jan 2026 6:41 PM IST

కోఠి కాల్పుల కేసు..  సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు

హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతంలో శనివారము ఉదయం జరిగిన దోపిడీ, కాల్పుల ఘటనను హైదరాబాద్ నగర పోలీసులు అత్యంత తీవ్రంగా పరిగణించారు. ఈ కేసు దర్యాప్తునకు, నిందితులను త్వరితగతిన పట్టుకునేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్ నం. 28/2026 గా కేసు నమోదు చేయబడిందని వెల్ల‌డించారు. భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 109 (హత్యాయత్నం), 309 (దోపిడీ) ఆయుధ చట్టం-1959 లోని సెక్షన్ 27 కింద అభియోగాలు మోపబడ్డాయని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడు కేరళలోని కోజికోడ్‌కు చెందిన రిన్షాద్ పి.వి. (26) (తండ్రి: అబ్దుల్ అజీజ్), రెడీమేడ్ పిల్లల దుస్తుల వ్యాపారి. ప్రస్తుతం నాంపల్లిలోని జనతా అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. జనవరి 7, 2026న దివాన్ దేవ్ఢీలో హోల్‌సేల్ స్టాక్ కొనుగోలు నిమిత్తం రూ. 6 లక్షల నగదుతో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. కొనుగోలు కుదరకపోవడంతో, తన బంధువు మిష్బాన్ సలహా మేరకు ఆ నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా, జనవరి 31, 2026న ఉదయం సుమారు 7 గంటలకు, తన స్నేహితుడు అమీర్‌కు చెందిన వాహనంపై కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఏటీయం వద్దకు చేరుకున్నారు. అక్కడ నగదు జమ చేస్తుండగా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెనుక నుండి వచ్చి, తుపాకీని కడుపు వద్ద పెట్టి బెదిరించారు. దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరపగా, అందులో ఒకటి ఫిర్యాదుదారుడి కుడి కాలికి తగిలి గాయమైంది. అనంతరం నిందితులు నగదు సంచితో పాటు వాహనం తాళంచెవులను బలవంతంగా లాక్కొని, బాధితుడి వాహనంతో అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు చాదర్‌ఘాట్ సిగ్నల్ మీదుగా నింబోలిఅడ్డా, కాచిగూడ వైపు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అక్కడ వాహనాన్ని వదిలివేసి, దుస్తులు మార్చుకుని కాచిగూడ చౌరస్తా వైపు కాలినడకన పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హైదరాబాద్ నగర పోలీసులు ఈ ఘటనపై తక్షణ చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించడం, సాంకేతిక ఆధారాలను సేకరించడం, పొరుగు పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులతో సమన్వయం చేసుకోవడం జరుగుతోందన్నారు.

పౌరుల భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం. నిందితులను త్వరగా పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం అన్ని వనరులను వినియోగిస్తోందని సీపీ తెలిపారు. అనుమానాస్పద కదలికలకు సంబంధించిన సమాచారం ఏదైనా ప్రజల వద్ద ఉంటే వెంటనే 'డయల్ 100' ద్వారా పోలీసులకు తెలియజేయగలరని.. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు.

గాయపడ్డ వ్యక్తి చెబుతుంది ఇదే

కోఠి ఎస్బీఐ ద‌గ్గ‌ర జ‌రిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ రిన్షద్ ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. అత‌డికి డాక్టర్లు కుడికాలు మోకాలి కింది భాగంలో శస్త్ర చికిత్స చేశారు. చికిత్స అనంతరం వైద్యులు అత‌డిని జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. బాధితుడు రిన్షద్ మాట్లాడుతూ ఉద‌యం జ‌రిగిన ఘ‌ట‌న‌ను వివ‌రించారు. ఈరోజు ఉదయం డబ్బులు డిపాజిట్ చేయడం కోసం కోఠిలోని ఎస్బిఐ ఎటిఎం డిపాజిట్ మిష‌న్‌ వద్దకు వెళ్లాను. డిపాజిట్ చేసేందుకు లోపలికి వెళ్తున్న క్రమంలో దుండ‌గులు నాపైన దాడి చేసి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశారు. నేను వారిని ప్రతిఘటించగా దుండగుడు గన్ తీసి నాపై కాల్పులు జరిపాడు. నా దగ్గర ఉన్న ఆరు లక్షలు తీసుకొని.. నేను తీసుకొచ్చిన యాక్టివా బండిపైనే పారిపోయారు. దాడి చేసిన దుండగులు ఎవరో నాకు తెలియదు. నిన్న కూడా 3 లక్షలు డిపాజిట్ చేసేందుకు ఏటీఎం దగ్గరికి వచ్చాను. ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళని నేను చూడ‌లేదు.. గమనించలేదు.. ఇద్దరూ మాస్కులు ధరించి ఉండటంతో గుర్తుపట్టలేదని వివ‌రించాడు.


కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం సమీపంలో శనివారం బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు బట్టల వ్యాపారి రిన్షద్‌పై కాల్పులు జరిపి గాయపరిచి, రూ.6 లక్షల నగదును దోచుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏటీఎం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ, దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Next Story