Telangana: కోటి ఆస్పత్రిలో ఎలుకల భీభత్సం.. సీఎస్, అధికారులకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్‌లోని కోటి ప్రసూతి ఆస్పత్రిలో వసతులు సరిగా లేవని తెలంగాణ హైకోర్టుకు లేఖ రావడంతో.. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య
By అంజి Published on 26 April 2023 10:45 AM IST
Telangana: కోటి ఆస్పత్రిలో ఎలుకల భీభత్సం.. సీఎస్, అధికారులకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్‌లోని కోటి ప్రసూతి ఆస్పత్రిలో వసతులు సరిగా లేవని తెలంగాణ హైకోర్టుకు లేఖ రావడంతో.. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ, తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోటి ప్రసూతి ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు లేవని రాపోలు భాస్కర్ అనే న్యాయవాది ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ ఆసుపత్రికి వచ్చే గర్భిణులు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారని అన్నారు. ఆసుపత్రిలో అవసరమైన కుర్చీలు లేకపోవడంతో రోగులు క్యూలో నిలబడాల్సి వస్తోందన్నారు.
ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్. తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ లేఖను పిల్‌గా మార్చింది. ప్రధాన కార్యదర్శికి, వైద్య అండ్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, టీ. వైద్య విధాన పరిషత్, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ మెడికల్ షాపుల నుంచి తప్పనిసరి మందులను కొనుగోలు చేయాల్సి వస్తోందని పిటిషనర్ తన లేఖలో ఆరోపించారు.
తమకు సరైన వైద్యం అందుతుందని, ఉచితంగా మందులు అందజేస్తని.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300-400 మంది గర్భిణులు కోటి ప్రసూతి ఆసుపత్రికి ప్రతిరోజు వస్తున్నారని ఆయన చెప్పారు. ఆసుపత్రిని ఎలుకలు, చెదపురుగులు ఆక్రమించాయని, దీనివల్ల గర్భిణులు, వారి సహాయకులు ప్రమాదంలో పడుతున్నారని పిటిషనర్ తెలిపారు. ఎలుకల బెడద కారణంగా రోగులు ఆస్పత్రిలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు జూలై 25కి వాయిదా వేసింది.