భాగ్యనగరంలో రాపిడో కేవలం ఒక ప్రయాణ సాధనంగానే కాకుండా, వేలాది మంది నిరుద్యోగులకు మరియు కార్మికులకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. నగరంలోని ప్రతి ఇద్దరు రాపిడో కెప్టెన్లలో ఒకరు దీనినే తమ ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారని సంస్థ వెల్లడించింది. కెప్టెన్లు ఎంత సంపాదిస్తున్నారనే దానిపై రాపిడో నివేదిక కీలక గణాంకాలను వెల్లడించింది.
హైదరాబాద్‌లో సగటున ఒక కెప్టెన్ నెలకు రూ. 65,000 నుండి రూ. 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. వాహనం రకం, పని చేసే సమయాన్ని బట్టి రోజుకు రూ. 3,000 నుండి రూ. 4,000 వరకు ఆదాయం లభిస్తోంది. దాదాపు 50 శాతం మంది కెప్టెన్లు రాపిడోపైనే పూర్తిస్థాయిలో ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో రాపిడోకు హైదరాబాద్ అతిపెద్ద ఉపాధి కేంద్రంగా నిలిచింది. నగరంలో 5.4 లక్షల మంది యాక్టివ్ కెప్టెన్లు ఉన్నారు. వివిధ విభాగాల్లో కలిపి నగరంలో మొత్తం 34.3 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు.
నగరవాసుల నుండి వస్తున్న భారీ డిమాండ్ కారణంగానే ఈ స్థాయిలో ఆదాయం లభిస్తోందని సంస్థ తెలిపింది. నగరంలో ప్రతిరోజూ 9.1 లక్షల రైడ్లు జరుగుతున్నాయి. నెలకు ఈ సంఖ్య 2.43 కోట్లకు చేరుతోంది. ఆఫీసులు, కాలేజీల వేళల్లో సుమారు 4.7 లక్షల రైడ్లు బుక్ అవుతున్నాయి. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే, రాపిడో ద్వారా ప్రయాణించడం వల్ల ప్రయాణికులు నెలకు దాదాపు రూ. 10,000 వరకు ఆదా చేయగలుగుతున్నారు.