విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వచ్చే రైళ్లలో బాంబులు పెట్టినట్లు 100 నంబరుకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్‌తో రైల్వే రక్షక దళం పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుండి సికింద్రాబాద్ వైపునకు వస్తున్న రైళ్లలో తనిఖీలు చేపట్టారు. కాజీపేటలో ఎల్‌టీటీ, చర్లపల్లి వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేసి తనిఖీలు చేస్తున్నారు.
ఇక భువనేశ్వర్ నుంచి ముంబై వెలుతున్న ఎక్స్‌ప్రెస్‌లో బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు లేకపోవడంతో ఆ రైలును పంపేశారు. ఇక ఇప్పటి వరకు రైళ్లలో ఎలాంటి పేలుడు పదార్థాలను గుర్తించలేదు. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం బెదిరింపు కోసమే అజ్ఞాత వ్యక్తి ఈ ఫోన్ చేశాడా? అన్న అంశాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. బాంబు బెదిరింపు కాల్‌తో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.