అలిగిపోయిన పీజేఆర్ కుమార్తె.. కారణం అదేనా?
PJR Daughter Vijaya Reddy. హైదరాబాద్ మేయర్ పదవి ఎన్నిక కాసేపట్లో జరగనుంది.
By Medi Samrat Published on 11 Feb 2021 12:53 PM IST
హైదరాబాద్ మేయర్ పదవి ఎన్నిక కాసేపట్లో జరగనుంది. ఇప్పటి వరకు తాజాగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. నూతనంగా ఎంపికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు కలెక్టర్ శ్వేతా మహంతి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ పార్టీల విజ్ఞప్తి మేరకు.. వారికి అనుకూలమైన భాషలో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మేయర్, డిప్యూటీ మేయర్ లను ఎన్నుకునే కార్యక్రమం ప్రారంభం కానుంది. తమ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ ఖరారు చేసింది.
కార్పొరేటర్లు మేయర్, ఉప మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో పాల్గొనడం లేదని ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు చెప్పారు. ఇదిలా ఉంటే బీజేపీ ఉప మేయర్ అభ్యర్థిగా ఆ పార్టీ మొదట రవిచారిని ప్రకటించింది. అయితే, ఈ రోజు జీహెచ్ంఎసీ సమావేశానికి ఆయన ఆలస్యంగా రావడంతో బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పేరును బీజేపీ ప్రకటించింది. అయితే మేయర్ అభ్యర్థిగా కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్టు సమాచారం.
గత కొంత కాలంగా మేయర్ పదవి తనకు దక్కుతుందని ఆశపడ్డారు పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి. కానీ అనూహ్యంగా తెరపైకి కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి రావడంతో ఆమె ఎంతో నిరాశ చెందారు. కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే... మేయర్ ఎన్నిక కార్యక్రమంలో పాల్గొనకుండా ఆమె వెళ్లిపోయారు. దాంతో టీఆర్ఎస్ సభ్యులు ఒక్కసారే షాక్ తిన్నారు. ఇదే సమయంలో విజయారెడ్డికి అనుకూలంగా పీజేఆర్ అభిమానులు నినాదాలు చేశారు. తమ నాయకురాలికి అన్యాయం చేశారని వారు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.