Hyderabad: పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు.. కారణమిదే?

నగరంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలబడటం ప్రజల్లో...

By -  అంజి
Published on : 25 March 2026 10:44 AM IST

Hyderabad Fuel Crisis, Petrol Shortage Rumors, Oil Marketing Companies Policy, HPCL BPCL Advance Payment, Petrol Pump Association Hyderabad, Telangana Civil Supplies Clarification

Hyderabad: పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు.. కారణమిదే?

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలబడటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే, రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఇది కేవలం చమురు కంపెనీలు (OMCs), బంకు యజమానుల మధ్య నెలకొన్న 'క్రెడిట్' వివాదమని పెట్రోల్ పంప్ అసోసియేషన్ స్పష్టం చేసింది.

అటు రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌కు కొరత లేదని తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించింది. హైదరాబాద్‌లో పలు పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారుల రద్దీ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు స్పందించారు. 'రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోంది. ప్రజావసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వదంతుల వల్లే ఫిల్లింగ్‌ స్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. ప్రజలు భయపడి అకస్మాత్తుగా కొనుగోలు చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు' అని అధికారులు సూచించారు.

ఇంతకుముందు హెచ్‌పీసీఎల్ (HPCL), బీపీసీఎల్ (BPCL), ఐఓసీఎల్ (IOCL) వంటి చమురు కంపెనీలు డీలర్లకు క్రెడిట్ (అప్పు) ప్రాతిపదికన ఇంధనాన్ని సరఫరా చేసేవి. అంటే డెలివరీ జరిగిన తర్వాత కొంత సమయం లోపు డబ్బు చెల్లించే వెసులుబాటు ఉండేది. కానీ, ఇటీవల ఈ కంపెనీలు అకస్మాత్తుగా తమ విధానాన్ని మార్చాయి. ఇప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ కావాలంటే ముందస్తు నగదు (Advance Payment) చెల్లించాలని పట్టుబడుతున్నాయి. ఈ మార్పును తట్టుకోలేక, నగదు సర్దుబాటు కాక చాలామంది డీలర్లు స్టాక్ తెప్పించుకోలేకపోతున్నారు.

పెరిగిన డిమాండ్.. తరిగిన నిల్వలు:

ఒక ప్రాంతంలో ఒక బంకు మూతపడగానే, వాహనదారులందరూ పక్కనే ఉన్న మరో బంకుకు వెళ్తున్నారు. దీనివల్ల 24 గంటలకు సరిపడా ఉండాల్సిన స్టాక్ కేవలం 5-6 గంటల్లోనే ఖాళీ అయిపోతోంది. ఫలితంగా నగరం మొత్తం ఇంధన కొరత ఉన్నట్లు భ్రమ కలిగిస్తోంది. ఇది పూర్తిగా పరిపాలనాపరమైన మరియు ఆర్థికపరమైన సమస్యే తప్ప, సరఫరాలో లోపం కాదని పౌర సరఫరాల శాఖ కూడా స్పష్టం చేసింది.

ప్రస్తుతం చమురు కంపెనీలు, బ్యాంకుల మధ్య జరుగుతున్న ఈ చెల్లింపుల ప్రక్రియ సద్దుమణిగితే, ఒకటి రెండు రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఆందోళన చెంది ముందస్తుగా నిల్వ చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.

Next Story