హైదరాబాద్ నగరంలోని బేగంపేట-నక్లెస్ రోడ్డు మార్గంలో ఎంఎంటీఎస్(MMTS) రైలుకు ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధంలో రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే రైలు దిగి దూరంగా పరుగులు తీశారు.
ఎంఎంటీఎస్ రైలు లింగంపల్లి నుంచి నాంపల్లికి వెలుతోంది. బేగంపేటలో కాసేపు ఆగింది. అనంతరం నాంపల్లికి వెలుతున్న సమయంలో బేగంపేట, నెక్లెస్ రోడ్డు స్టేషన్‌ల మధ్య ఆగిపోయింది. ఆ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. దీంతో ప్రయాణీకులు ఏదో జరిగిందని ఆందోళన చెంది రైలు దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సాంకేతిక లోపం కారణంగానే రైలు ఆగిపోయినట్లు తెలుస్తోంది.
బేగంపేట నుంచి రైలు బయలుదేరిన కాసేపటికే ఆగిపోయిందని ప్రయాణీకులు తెలిపారు. ఆ సమయంలో రైలు వేగం తక్కువగానే ఉందన్నారు. అధిక వేగంతో ఉండి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆఫీసు వేళలు కావడడంతో రైలులో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు.
ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు..
హైద్రాబాద్ లో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు హైద్రాబాద్ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ను (ఎంఎంటీఎస్)ను ప్రారంభించారు. అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఎల్ కే అద్వానీ ఎంఎంటీఎస్ ను 2003 ఆగస్టు 9వ తేదీన ప్రారంభించారు. హైద్రాబాద్ లో మూడు ప్రధాన సుదూర రైలు టెర్మినల్ ను ఎంఎంటీఎస్ తో అనుసంధానం చేశారు. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణికులు సుదూర ప్రయాణం చేసేందుకుగాను ఈ ఎంఎంటీఎస్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చారు.