కేవలం ఓవైసీ సోదరులు మాత్రమే ధనవంతులయ్యారు.. ప్రజలు కాదు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ పార్లమెంట్ సీట్ గురించి కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది.
By Medi Samrat Published on 15 April 2024 10:18 AM GMTసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ పార్లమెంట్ సీట్ గురించి కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పై పోటీకి భారతీయ జనతా పార్టీ కె.మాధవి లతను ఎన్నికల బరిలోకి దింపారు. ఆమె తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి మాధవి లత తన ప్రత్యర్థి అసదుద్దీన్ ఒవైసీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.. హైదరాబాద్ పార్లమెంట్ వెనుకబడడానికి కారణం ఎంఐఎం అంటూ విరుచుకు పడుతున్నారు.
అసదుద్దీన్ ఒవైసీకి కాంగ్రెస్‌తో మంచి సంబంధాలే ఉన్నాయని.. అవి రోజురోజుకూ బలపడుతూ ఉన్నాయని లత అన్నారు. తాను ఒవైసీ సోదరులను కలవలేదని.. అయితే తాను హైదరాబాద్ నుంచి ఎన్నికల్లో గెలిస్తే ముందుగా ఒవైసీ సోదరులకు వక్ఫ్ బోర్డు కింద కట్టబెట్టిన భూములను విడిపిస్తానని ఆమె అన్నారు. బీజేపీ ప్రగతిశీల విధానాలతో ప్రజల ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తూ ఉందని అన్నారు. ఓటర్లలో భయాన్ని సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తూ ఉన్నాయని.. తాము మాత్రం మానవ విలువలు, ప్రేమ, గౌరవంతో మా ప్రచారాన్ని చేస్తున్నామని ఆమె అన్నారు. అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలు గతంలో అద్దె ఇళ్లలో ఉండేవారని.. ఇప్పుడు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బంగ్లాలో నివసిస్తున్నారని మాధవీ లత ఆరోపించారు. ముస్లింలలో వీరు అంబానీలుగా మారారు. తమను తాము ముస్లిం సమాజానికి రక్షకులమని చెప్పుకుంటారు.. కానీ వాళ్లు మాత్రమే ధనవంతులు అయ్యారు. నమ్మిన ముస్లింలకు ద్రోహం చేశారని మాధవీ లత ఆరోపించారు.