వామ్మో.. 2022లో హెల్మెట్ లేని హైదరాబాద్ రైడర్‌లపై 15లక్షలకు పైగా కేసులా
Over 15L cases booked against helmetless Hyd riders in 2022.: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్లు ధరించాలని
By తోట వంశీ కుమార్ Published on 9 July 2022 3:48 AM GMTహైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్లు ధరించాలని ట్రాఫిక్ పోలీసులు ఎన్ని సార్లు చెబుతున్నప్పటికి కొంత మందిలో మార్పు రావడం లేదు. నిబంధనలు అతిక్రమిస్తే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. అయితే.. చలాన్లు అయినా కడతాం గానీ హెలెట్లు మాత్రం పెట్టుకోం అని అంటున్నారు భాగ్యనగరంలోని కొందరు.
హైదరాబాద్‌లో ఎంతో మంది హెల్మెట్లు పెట్టుకోకుండానే ప్రయాణం చేస్తున్నారు. వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన మొత్తం కేసుల్లో సగానికి పైగా హెల్మెట్ ధరించనందుకు నమోదైనవే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2022 జనవరి 1 నుంచి జూలై 7 మధ్య కాలంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించని రైడర్‌లపై 15,46,245 కేసులు నమోదు చేశారు. నమోదైన కేసుల్లో పిలియన్ రైడర్లు(బైక్‌పై వెనుక కూర్చున వారు) హెల్మెట్ ధరించని కేసులు కూడా ఉన్నాయి. సిటీ ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది మొత్తం 21,76,326 కేసులు బుక్ చేశారు. వీటిలో 8,87,883 చలాన్లు క్లియర్ కాగా 12,88,443 పెండింగ్‌లో ఉన్నాయి.
మరో సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘన అతివేగం. 2022లో హైదరాబాద్ పోలీసులు అతివేగం, ప్రమాదకరమైన డ్రైవింగ్‌పై మొత్తం 61,398 కేసులు నమోదు చేశారు. 2021లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ఉల్లంఘనలపై 53 లక్షల కేసులు నమోదు చేశారు.
హెల్మెట్ లేని టీఆర్‌ఎస్ నేతలపై చర్యలు లేవు
జూలై 2న పలువురు టీఆర్‌ఎస్ నాయకులు హెల్మెట్ ధరించకుండా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే డి.నాగేందర్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్ సభ్యులు హెల్మెట్ లేకుండానే ర్యాలీలో కనిపించారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించారు.
వారిపై కేసు బుక్ చేయబడిందా లేదా అనే విషయంపై న్యూస్‌మీటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను సంప్రదించగా.. వారు ఇ-చలాన్ జారీ చేయలేదని ధృవీకరించారు. "ఇ-చలాన్ జారీ చేయబడలేదు ఎందుకంటే అలాంటి సమయంలో శాంతి భద్రతల అంశంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తామం " అని ఒక అధికారి తెలిపారు.
2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 68 మంది చనిపోయారు
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి ఇప్పటివరకు 68 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. వీరిలో 47 మంది హెల్మెట్ ధరించని వారు కాగా.. 21 మంది పిలియన్ రైడర్లు. సైబరాబాద్‌లో గత ఆరు నెలల్లో మొత్తం 211 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. జనవరి నుండి నమోదైన మరణాలలో ద్విచక్ర వాహన ప్రమాదాలు 58శాతంగా ఉన్నాయి. ఈ 211 మందిలో 172 మంది హెల్మెట్ ధరించని డ్రైవర్లు కాగా మిగిలిన వారు పిలియన్ రైడర్లు.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గతేడాది నిర్వహించిన అధ్యయనంలో ద్విచక్ర వాహన ప్రమాదాల్లో మరణించిన వారిలో 82శాతం మంది హెల్మెట్ ధరించడం లేదని తేలింది.
చట్టం ఏం చెబుతోంది?
మోటారు వాహనాల చట్టం (MVA)లోని సెక్షన్ 129 ప్రకారం బైక్ నడిపే వ్యక్తి తప్పని సరిగా నిర్థేశిత ప్రమాణాలు కలిగిన హెల్మెట్లను తప్పని సరిగా తరలించాలి. అయితే.. సిక్కులకు ఇది వర్తించదు. వారు ద్విచక్రవాహనం నడిపేటప్పుడు తలపాగా ధరించి ఉన్నట్లయితే ఈ నిబంధన వారికి వర్తించదు.
MVA ప్రకారం.. బైక్ నడిపే వ్యక్తికి హెల్మెట్ లేకపోయినా, పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించకపోయినా రూ.200 జరిమానా విధిస్తారు.
లక్షకు పైగా ఛార్జ్ షీట్లు
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని సార్లు ఈ-చలాన్‌లకు బదులుగా ఛార్జ్ షీట్‌లు దాఖలు చేస్తున్నారు, ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపడం, మైనర్‌లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన సందర్భాల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు. ఈ ఏడాది 1,38,298 ఛార్జ్ షీట్లను ట్రాఫిక్ విభాగం దాఖలు చేసింది. వీటిలో 15 కేసుల్లో జైలు శిక్ష పడింది. మిగిలిన వారికి జరిమానా విధించింది కోర్టు. ఈ జరిమానా మొత్తం రూ. 57,46,527.