ఔటర్ రింగ్‌రోడ్డుపై అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
సైబరాబాద్ పోలీసులు ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డుపై కొత్త స్పీడ్ లిమిట్స్‌ను పెట్టారు. అవి అమల్లోకి వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 31 July 2023 10:04 AM GMTఔటర్ రింగ్‌రోడ్డుపై అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
రోజురోజుకి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. యువత మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహన దారులకు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించేందుకు అనుమతి లేదు. అయినా కూడా ద్విచక్ర వాహనదారులు ఔటర్ రింగ్ రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నడపడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో బలి అవుతున్నారు. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న సైబరాబాద్ పోలీసులు ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డుపై కొత్త స్పీడ్ లిమిట్స్‌ను పెట్టారు. అవి ఈరోజు నుంచే అమల్లోకి వచ్చాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ని జారీ చేశారు.
ఔటర్ రింగ్‌రోడ్డుపై లైన్-1 అండ్ లైన్-2లో 100 కి.మీ వేగం నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ రెండు లైన్లలో కనిష్ట వేగం గంటకు 80 కి.మీల చొప్పున మెయిన్‌టేయిన్ పోలీసులు తెలిపారు. ఇక ఔటర్ రింగ్ రోడ్డు లైన్-3, లైన్ -4లో గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఇక కనిష్ట వేగాన్ని 40 కిలోమీటర్లు ఉండాలని తెలిపారు.
ఓఆర్ఆర్‌లో కనీస వేగం గంటకు 40 కిలోమీటర్లు ఉండాలి. దీనికంటే తక్కువ వేగంతో ఓఆర్ఆర్‌లో ప్రయాణించడానికి ఏ వాహనానికి అనుమతి లేదని తెలిపారు. వేగంగా వెళ్లే వాహనాలు కుడి లైన్లలో (లైన్-1, లైన్-2) వెళ్లాలని, నెమ్మదిగా కదిలే వాహనాలు ఎడమ లైన్లు (లైన్-3, లైన్-4)లో ప్రయాణించాలని తెలిపారు. ఇక భారీ వాహనాలు అయితే లైన్-3, లైన్-4లో మాత్రమే వెళ్లాలని పోలీసులు వివరించారు.
వేగాన్ని మార్చుకునే అన్ని వాహనాలు సంబంధిత స్పీడ్ రేంజ్ ఉన్న లైన్‌కు వెళ్లాలని పోలీసులు తెలిపారు. లైన్ల మధ్య జిగ్-జాగ్ కదలికలకు అనుమతి లేవని అన్నారు. లైన్‌ను మార్చుకునే ముందు ఇండికేటర్లను తప్పకుండా ఉపయోగించాలని.. ఆ తర్వాత మాత్రమే లైన్‌లను మార్చుకోవాలని సూచించారు. లైన్ మారే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు పోలీసులు. లేదంటే ప్రమాదాలకు గురవ్వాల్సి వస్తుందని సూచించారు. ఓఆర్‌ఆర్ లోని ఏ లైన్‌లో కూడా వాహనాలు నిలిపేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై వాహనాలు నిలిపి ప్రయాణికులను కూడా ఎక్కించుకోవద్దన్నారు. పాదాచారులకు కూడా ఓఆర్‌ఆర్‌పైకి అనుమతి లేదని నోటిఫికేషన్‌లో పోలీసులు చెప్పారు.