హైదరాబాద్ పరిధిని విస్తరించడంపై నేటి నుంచి జీహెచ్‌ఎంసీ ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనుంది. ఈ కార్యక్రమం నేటి నుంచి వారం రోజుల పాటు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని జనాభా పెరిగింది.
కాగా జీహెచ్‌ఎంసీల వార్డులను కూడా 150 నుంచి 300కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది. డీలిమిటేషన్‌పై ప్రజలు, వ్యక్తులు, సంస్థల నుంచి అభ్యంతరాలను జోనల్ కార్యాలయాలు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాల్లో అధికారులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని, సలహాను ఆలస్యం చేయకుండా, ఏ రోజుకు ఆ రోజే క్లియర్ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. అభ్యంతరాలు, సలహాలను కేవలం లిఖితపూర్వకంగా సర్కిల్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్లు, జోనల్ స్థాయిలో జోనల్ కమిషనర్లతో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా అభ్యంతరాలను, సలహాలను స్వీకరించనున్నారు.