అలా గవర్నర్ ప్రారంభించారు.. ఇలా అధికారులు మూసి వేయించారు
Numaish suspended till Jan 10.హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభమైన అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్
By M.S.R Published on 3 Jan 2022 1:14 PM ISTహైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభమైన అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ నుమాయిష్ ఒక్క రోజు కూడా కాకుండానే మూతపడింది. జనవరి 1న హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుమాయిషన్‌ను ప్రారంభించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 2వ తేదీ రాత్రి సమయంలో నుమాయిష్‌ను మూసివేశారు. ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న దాదాపు పదివేల మంది బయటకు వచ్చేసారు. పోలీసు అధికారుల నుంచి అందిన ఆదేశాలతో తొలుత టికెట్ బుకింగ్ కౌంటర్లను మూసేశారు. ఆ తర్వాత యజమానులు స్టాళ్లను మూసివేశారు. లోపల ఉన్న సందర్శకులు వెళ్లిపోవాల్సిందిగా మైకుల ద్వారా ప్రకటించారు. నుమాయిష్ సందర్శనకు వచ్చిన సందర్శకులు ఈ ప్రకటనతో నిరాశగా వెనుదిరిగారు.
రాష్ట్రవ్యాప్తంగా జనవరి 10 వరకు సామూహిక సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో జనవరి 10వ తేదీ వరకు నుమాయిష్-2022ను నిలిపివేయాలని సొసైటీ నిర్ణయించిందని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి అశ్విన్ తెలిపారు.
ప్రతిరోజూ దాదాపు 45,000 మంది సందర్శిస్తున్న ఈ ఎగ్జిబిషన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం 'నుమాయిష్' జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. 2019లో 20 లక్షల మందికి పైగా ఎగ్జిబిషన్‌ని సందర్శించారు. ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి యొక్క సమ్మేళనంగా ఈ కార్యక్రమం విశాలమైన మైదానంలో నిర్వహించబడుతుంది. ఫెయిర్ నుండి వచ్చే ఆదాయాన్ని విద్యా మరియు స్వచ్ఛంద సంస్థలపై ఖర్చు చేస్తారు. ఎగ్జిబిషన్ కోసం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుండి మాత్రమే కాకుండా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుండి పొరుగు రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వస్తారు. Numaish-e-Masnuaat-e-Mulki లేదా క్లుప్తంగా, Numaish అని అంటారు. 1938లో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులను ప్రోత్సహించే కార్యక్రమంగా ప్రారంభించబడింది. కేవలం 50 స్టాల్స్‌తో ప్రారంభించి, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనలలో ఒకటిగా రూపుదిద్దుకుంది. హైదరాబాద్ స్టేట్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటి నుమాయిష్‌ను ప్రారంభించారు.