ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో మూసీ నదికి వరద పొటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లతో పాటు గండిపేట చెరువు గేట్లు ఎత్తడంతో నదిలోకి ఒక్కసారిగా ఉధృతి పెరిగింది. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వాహనదారులు వెళ్లకుండా బ్రిడ్జికి ఇరువైపుల బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అంబర్‌పేట - మలక్‌పేట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
మూసీ నదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో మూసానగర్, కమలానగర్ జలదిగ్బంధం అయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించి.. రత్నానగర్, పటేల్‌నగర్ గోల్నాకలో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాలకు బాధితులను రతలించారు. అలాగే భారీ వరదల కారణంగా చాదర్‌ఘాట్ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయబడింది. రెండు బ్రిడ్జిల మూసివేతతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు వేరే దారుల గుండా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఉస్మాన్‌సాగర్‌లోకి 8 వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. దీంతో అధికారులు 13 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 8,281 క్యూసెక్కులు మూసీలోకి విడుదల చేశారు. ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుతం 1,789.10 అడుగుల నీటిమట్టం ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు. హిమాయత్‌సాగర్‌కు 10 వేల క్యూసెక్కులు వస్తుండగా, 8 గేట్లు ఎత్తి 10,700 క్యూసెక్కుల నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1762.70 అడుగులు. గరిష్ఠనీటిమట్టం 1763.50 అడుగులు.