అమోర్ ఆస్పత్రిలో బర్న్స్ వార్డు ప్రారంభం
అమోర్ ఆస్పత్రిలో అత్యాధునిక బర్న్స్ వార్డును కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం ప్రారంభించారు.
By అంజి Published on 14 March 2023 9:30 AM GMTఅమోర్ ఆస్పత్రిలో బర్న్స్ వార్డు ప్రారంభం
* ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
* ఐసీయూ, ఐసొలేషన్ వార్డులతో ప్రత్యేక వార్డు ఏర్పాటు
* నగరంలో ఈ తరహా వార్డున్న రెండో ప్రైవేటు ఆస్పత్రి ఇదే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సగటున రోజుకు నాలుగైదు కాలిన గాయాల కేసులు వస్తుంటాయి. జిల్లా ఆస్పత్రులలో వీటికి చికిత్స చేసే ప్రత్యేక వార్డులు లేకపోవడంతో వారంతా హైదరాబాద్‌కే వస్తారు. కానీ, నగరంలో ప్రభుత్వ రంగంలో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులలోనే బర్న్స్ వార్డులు ఉన్నాయి. ఇక ప్రైవేటు రంగంలో అయితే ఇది రెండో ఆస్పత్రి మాత్రమే. పారిశ్రామిక ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉన్న కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న అమోర్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటుచేసిన అత్యాధునిక బర్న్స్ వార్డును కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం ప్రారంభించారు. ఐసీయూ, ఐసొలేషన్ వార్డులతో కూడిన ఈ బర్న్స్ వార్డులో.. ఏరకంగా కాలిన గాయాలు అయినా వాటికి అత్యాధునిక చికిత్సలు అందించడం సాధ్యమవుతుందని వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ''ఈ ప్రాంతంలో పరిశ్రమలు అధికంగా ఉండటంతో పాటు, హైటెక్ సిటీ దగ్గరలో ఉండటంతో జనాభా కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటోంది. ఏ చిన్న ప్రమాదం జరిగినా కాలిన గాయాలు అయినవారు ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు అమోర్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా బర్న్స్ వార్డు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతవాసులకు మెరుగైన సేవలు అందుతాయి. నిపుణులైన వైద్యులు ఉండటంతో పాటు మంచి పరికరాలతో కూడిన వార్డును ఏర్పాటు చేసినందుకు అమోర్ ఆస్పత్రి యాజమాన్యానికి, ఎండీ కిశోర్ రెడ్డికి అభినందనలు'' అని తెలిపారు.
బాలాజీనగర్ వార్డు కార్పొరేటర్ పగుడాల శిరీష మాట్లాడుతూ.. వంట చేసేటప్పుడు చాలామంది గృహిణులు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అగ్నిప్రమాదాలకు గురవుతారని, అలాంటి సందర్భాల్లో చికిత్సల కోసం దూరాభారం వెళ్లాల్సిన అవసరం లేకుండా దగ్గరలోనే ఇంత మంచి చికిత్స అందిస్తున్నందుకు అమోర్ ఆస్పత్రిని ఎంతగానో అభినందించాలని అన్నారు.
బర్న్స్ వార్డు ప్రారంభోత్సవం సందర్భంగా ఆస్పత్రి ఎండీ, ప్రముఖ ఆర్థో ఆంకాలజీ సర్జన్ డాక్టర్ కిశోర్ బి.రెడ్డి మాట్లాడుతూ.. ''హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ జిల్లాల్లోనూ ఇళ్లు, పరిశ్రమల్లో రకరకాల ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిలో కాలిన గాయాలు అయినవారికి నాణ్యమైన చికిత్స అందించేందుకు తగిన సదుపాయాలు విస్తృతంగా అవసరం అవుతాయి. ఈ ఆలోచనతోనే మా ఆస్పత్రిలో నాలుగు పడకల ఐసీయూ, ఐసొలేషన్ వార్డుతో కూడిన బర్న్స్ వార్డు ఏర్పాటుచేశాం. ఇందులో డ్రసింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ప్రతి నిమిషం దగ్గరుండి చూసుకునేందుకు సుశిక్షితులైన సిబ్బంది మా దగ్గర ఉన్నారు. ఆస్పత్రిలోనే ప్లాస్టిక్, రీకన్ స్ట్రక్టివ్ సర్జన్ ఉన్నారు. 24 గంటలు క్రిటికల్ కేర్ సపోర్ట్ ఉంటుంది. ప్రత్యేకంగా డ్రసింగ్ రూం ఉంది. చర్మానికి ప్రత్యామ్నాయంగా ఉండే అత్యాధునిక మందులు, డ్రసింగులతో కూడిన మెడికల్ స్టోర్ అందుబాటులో ఉన్నాయి. మూత్రపిండాల డయాలసిస్ సదుపాయంతో కూడిన గదులు ఉన్నాయి. బర్న్స్ వార్డు చికిత్సల్లో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులు ఉన్నారు. డ్రసింగ్ చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి, రోగులకు వణుకు రాకుండా ఉండేందుకు ప్రతి గదిలో హీటర్ సదుపాయాలు సైతం కల్పించాం. ప్రతి గదికీ ప్రత్యేకంగా నర్సు (1:1) ఉంటారు. ప్రతి గదిలోనూ బీపీ, ఎస్.పి.ఓ.2, ఈసీజీ, సీవీపీ పరిశీలనకు మల్టీ పార్ట్ మానిటర్లు ఉన్నాయి. ఆపరేషన్ థియేటరుకు దగ్గరగా ఉండటంతో మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రత్యేకంగా బర్న్స్ ఫిజియోథెరపీ, ఆర్థోటిక్స్ సెంటర్ ఉన్నందువల్ల రోగులకు అన్నీ అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి'' అని వివరించారు.
ఆస్పత్రికి చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ బాదం అభినందన్ మాట్లాడుతూ.. ''పరిశ్రమలలో రసాయనాల వల్ల గానీ, ఇళ్లలో గ్యాస్ స్టౌ, కిరోసిన్, లేదా పెట్రోలు లాంటివి పడి అంటుకోవడం వల్ల గానీ కాలిన గాయాలు అయినప్పుడు ముందుగా వెంటనే పంపు కింద ప్రవహించే నీటితో ఆ భాగాన్ని కడగాలి. అనంతరం శుభ్రమైన వస్త్రంతో ఆ భాగాన్ని తుడిచి, వెంటనే ఆస్పత్రికి తరలించాలి. సుశిక్షితులైన ప్లాస్టిక్, రీకన్‌స్ట్రక్టివ్ వైద్యులు ఉండటంతో పాటు, ప్రత్యేకమైన బర్న్స్ వార్డు ఉండటం చాలా ముఖ్యం. ఎవరికైనా శరీరంపై కాలిన గాయాలైనప్పుడు వారికి దుస్తులు ఉంటే తీసేసి, వెంటనే ఆస్పత్రికి తీసుకురావాలి. గాయాలు మరీ తీవ్రంగా లేకపోతే ఓపీలో చికిత్స చేసి పంపేస్తాం. గాయాల తీవ్రత, శాతం ఎక్కువగా ఉంటే ఆస్పత్రిలో చేరుస్తాం. పిల్లలు, వృద్ధులనైనా ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయాలి. ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలంటే ఐసొలేషన్‌లో పెట్టాలి. అలాగే 20% గాయాలు దాటితే శరీరంలోంచి నీరు పోతుంది. దానికి సెలైన్లు పెట్టాలి. ఈ చికిత్సలు వెంటనే చేయకపోతే రోగులు షాక్‌లోకి వెళ్లి, ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది'' అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంకా అమోర్ ఆస్పత్రి క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ సర్దార్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంటల్ డాక్టర్ హెచ్ఎం జయశేఖర్, ఆస్పత్రి సిబ్బంది, నర్సులు తదితరులు పాల్గొన్నారు.