Hyderabad: జూ పార్క్‌లో గంధపు చెట్లను నరికిన దుండగులు అరెస్ట్

హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో గంధపు చెట్లను నరికిన దుండగులను బహుదూర్‌పుర పోలీసులు గుర్తించారు.

By అంజి  Published on  24 July 2023 1:32 PM IST
Miscreants arrest, sandalwood trees, Hyderabad Zoo Park

Hyderabad: జూ పార్క్‌లో గంధపు చెట్లను నరికిన దుండగులు అరెస్ట్

హైదరాబాద్‌: 'పుష్ప' సినిమా తరహాలో పోలీసుల చేతికి చిక్కకుండా నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో గుర్తుతెలియని కొందరు దుండగులు గంధపు చెట్లను నరికి వాటిని చిన్నచిన్న దుంగలుగా చేసి అక్కడికి నుండి తీసుకువెళ్లిన వైనం తీవ్ర సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అయితే పార్కులో చెట్లను నరికివేత కేసులో బహుదూర్‌పుర పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి.. చెట్ల నరికివేతకు పాల్పడిన నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. పార్క్‌లో ఉన్న గంధపు చెట్లను నరికి అక్కడ ఉన్న సీసీ కెమెరాలకు చిక్కకుండా బయటికి తరలించిన తీరుపై పోలీసులకు అనుమానం కలిగింది. ఇది ఇంటి దొంగ పనై ఉంటుందని, ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగించడంతో అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు.

ఈ కేసులో జూ పార్క్‌లో పనిచేస్తున్న నలుగురు జూనియర్ స్థాయి సిబ్బంది పాత్ర ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు సిబ్బంది మరికొందరితో చేతులు కలిపి పోలీసుల కంట పడకుండా అక్కడున్న సీసీ కెమెరాలకు చిక్కకుండా అతి జాగ్రత్తగా ఏడు గంధపు చెట్లను నరికి వాటిని చిన్నచిన్న దుంగలుగా చేసి అక్కడి నుండి తరలించారు. బహుదూర్‌పుర పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించగా జూ పార్కులో పనిచేస్తున్న నలుగురు జూనియర్ స్థాయి సిబ్బంది పాత్ర ఇందులో ఉన్నట్లుగా గుర్తించారు. అయితే వీరు తెలివిగా పార్క్‌లో ఉన్న సీసీ కెమెరాలు ఆఫ్ చేసి చెట్లను నరికించినట్లుగా పోలీసులు నిర్ధారించారు.

అనంతరం ఆ చెట్లను దుంగలుగా మార్చి బయటకు తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగించారు. అసలు గంధపు చెట్లను ఎందుకు నరికారు? వాటిని ఎక్కడికి తరలించారు? వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. ఇదిలా ఉండగా.. జూ పార్క్‌లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు గంధపు చెట్లను నరికినట్లుగా విషయం తెలియడంతో అధికారులు వెంటనే ఆ నలుగురిని విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story