కేసీఆర్ కోసం మహంకాళి అమ్మవారిని ప్రత్యేకంగా మొక్కుకున్నా: మల్లారెడ్డి

ఈ ఏడాది సీఎం కేసీఆర్‌ కోసం ప్రత్యేకంగా మొక్కుకున్నానని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  9 July 2023 11:43 AM GMT
Minister MallaReddy, Ujjaini Bonalu, CM KCR, BRS,

కేసీఆర్ కోసం మహంకాళి అమ్మవారిని ప్రత్యేకంగా మొక్కుకున్నా: మల్లారెడ్డి

హైదరాబాద్‌లో ఘనంగా బోనాలు జరుగుతున్నాయి. ఆషాఢం బోనాల్లో భాగంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం ఉదయమే అమ్మవారికి ప్రభుత్వం తరఫున తొలి బోనం సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. ఆ తర్వాత నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ కోర్కెలు కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర పార్టీ నాయకులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో అమ్మవారిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి మల్లారెడ్డి ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం తర్వాత మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకుంటానని చెప్పారు. చిన్నప్పటి నుంచి బోనాల్లో పాల్గొనడం అంటే ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పారు. కుటుంబ సభ్యులతో ఈసారి కూడా బోనం సమర్పించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు నేను మహంకాళి తల్లిని కోరుకున్న కోర్కెలు అన్నీ నెరవేరాయని అన్నారు మంత్రి మల్లారెడ్డి. అయితే.. ఈ ఏడాది సీఎం కేసీఆర్‌ కోసం ప్రత్యేకంగా మొక్కుకున్నానని చెప్పారు. ఏం మొక్కుకున్నారనే విషయాన్ని కూడా మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్, బీజేపీ పరిపాలను చూశామని అన్నారు. ఈ రెండు జాతీయ పార్టీల పాలనలో ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని చెప్పారు. కానీ బీఆర్ఎస్‌ పాలనలో తెలంగాణ దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుదని అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న అభివృద్ధే దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అందుకే బీఆర్ఎస్‌ దేశ వ్యాప్తంగా విజయవంతం అవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. అప్పుడే దేశ ప్రజల కోరిక కూడా తీరుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

Next Story