సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ సన్నాహక సమావేశం
Minister KTR's preparatory meeting on the opening ceremony of the secretariat. సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
By అంజి Published on 9 Feb 2023 1:11 PM GMTసచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టినందున ప్రతి నియోజక వర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సచివాలయ ప్రారంభ అనంతరం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల మంది హాజరయ్యేలా చూడాలన్నారు
జన సమీకరణ కోసం ఈ నెల 13 న గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలన్నారు. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జిలుగా నియమిస్తామన్నారు. ఇంచార్జిలు 13 నుంచి 17 వరకు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షిస్తారని తెలిపారు. సచివాలయ ప్రారంభోత్సవం, పరేడ్ గ్రౌండ్ సభను అందరు కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభోత్సవం
హుస్సేన్ సాగర్ సరస్సు సమీపంలో దాదాపు రూ.650 కోట్లతో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని ఆధునిక సౌకర్యాలతో ఏడంతస్తుల నూతన సచివాలయాన్ని నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సచివాలయ సముదాయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టింది. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి అద్దం పడుతుందని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య వేద పండితులు సూచించిన శుభ ముహూర్తంగా సీఎం కేసీఆర్ భవనాన్ని ప్రారంభించనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతినిధిగా జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్‌లను ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ప్రారంభ కార్యక్రమానికి మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.