మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్
Minister KTR keeps his word extends support to the family of Jaipur-Mumbai train shooting victim Saifuddin. జైపూర్ – ముంబై రైల్లో కాల్పుల్లో మరణించిన సైఫుద్దీన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.
By Medi Samrat Published on 5 Aug 2023 8:23 PM ISTజైపూర్ – ముంబై రైల్లో కాల్పుల్లో మరణించిన సైఫుద్దీన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. కులీకుతుబ్ షా పట్టణాభివృద్ధి సంస్థలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. జియగూడలో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని అధికారులను ఆదేశించింది. వితంతు పెన్షన్ కూడా మంజూరు చేసింది. సైఫుద్దీన్ ముగ్గురు కుమార్తెలకు బీఆర్ఎస్ తరపున రూ. 2 లక్షల చొప్పున, మజ్లిస్ తరపున రూ. 1 లక్ష చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నారు.
శుక్రవారం అసెంబ్లీలో హామీ ఇచ్చినట్లుగా, జూలై 31న జైపూర్-ముంబై రైలులో మరణించిన హైదరాబాద్ నివాసి సయ్యద్ సైఫుద్దీన్ కుటుంబాన్ని మంత్రి కేటీ రామారావు ఆదుకున్నారు. దివంగత సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్‌ను ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. మృతుడి కుటుంబం దీనస్థితిని ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మృతుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థించారు. ఒవైసీ అభ్యర్థనపై స్పందించిన మంత్రి కేటీఆర్, బాధితుడి భార్యకు ఉద్యోగం, 2బీహెచ్‌కే ఫ్లాట్‌ను అందజేసి కుటుంబానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ తరపున కేటీఆర్ కూడా రూ. 6 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అసెంబ్లీ ఆవరణలోని అంజుమ్ షాహీన్‌కు జియాగూడలోని 2బీహెచ్‌కే ఫ్లాట్ కేటాయింపు ఆర్డర్‌ను కూడా శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.
సైఫుద్దీన్, మొబైల్ ఫోన్ టెక్నీషియన్, హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్‌లో నివాసం ఉండేవాడు. అతని సంపాదన మీదే కుటుంబం ఆధారపడి బతుకుతూ ఉండేది. జైపూర్-ముంబై రైలులో కాల్పుల ఘటనలో చనిపోయిన నలుగురు వ్యక్తులలో సైఫుద్దీన్ ఒకరు. రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ జరిపిన కాల్పుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐతో పాటు ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. చేతన్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు.