హైదరాబాద్ సిగలో మరో మణిహారం, స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌లో ప్రజలకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  19 Aug 2023 12:55 PM IST
Minister KTR,  Steel bridge, Hyderabad ,

హైదరాబాద్ సిగలో మరో మణిహారం, స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌లో ప్రజలకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్‌ కష్టాలను తొలగించేందుకు రద్దీ ఉన్న చోట్ల ప్రభుత్వం బ్రిడ్జిలు నిర్మిస్తోంది. ఈ క్రమంలో ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు మంత్రులు తలసాని, మహమూద్‌అలీ, ఎంపీ కేకే, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయ లక్ష్మి పాల్గొన్నారు.

ఈ స్టీల్ బ్రిడ్జి ప్రారంభం కావడంతో నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్‌ పడనుంది. ఇందిరాపార్క్, అశోక్‌ నగర్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో ట్రాఫిక్‌ సమస్య లేకుండా బాగ్‌ లింగంపల్లి వీఎస్‌టీ జంక్షన్‌ వరకు సులభంగా చేరుకోవచ్చు. అయితే.. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు దగ్గర ట్రాఫిక్‌ పూర్తిగా తగ్గిపోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. అయితే.. ఆగస్టు 19న మంత్రి కేటీఆర్ స్టీల్‌బ్రిడ్జిన లాంఛనంగా ప్రారంభించారు. కాగా..ఈ బ్రిడ్జికి మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టింది ప్రభుత్వం.

మొత్తం 2.63 కిలోమీటర్ల పొడవున్న వీఎస్‌టీ-ఇందిరాపార్క్‌ బ్రిడ్జిని రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీన్ని స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ కింద జీహెచ్‌ఎంసీనే నిర్మించింది. తొలిసారిగా మెట్రో బ్రిడ్జి పై నుంచి స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు అధికారులు. దక్షిణ భారత దేశంలోనే అతిపొడవైన స్టీల్ బ్రిడ్జి ఇదే అని అధికారులు చెబుతున్నారు. భాగ్య నగరంలో ప్రారంభించుకోవడం పట్ల ప్రజా ప్రతినిధులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్..ఇందిరా పార్క్‌ను అద్భుతంగా తీర్చుదిద్దుతామని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్‌లో ప్రారంభించిన ఫ్లైఓవర్లలో ఇది 36వది అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నాయిని నర్సింహారెడ్డి పేరుని ఈ స్టీల్‌ బ్రిడ్జికి పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారని కేటీఆర్ చెప్పారు. లోయర్ ట్యాంక్ బండ్, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తామని చెప్పారు. కొందరు రాష్ట్రంలో మతం పేరుతో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని దీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.

Next Story