Hyderabad: మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. కోటి రూపాయల ఆస్తి బుగ్గి!
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By - అంజి |
Hyderabad: మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. కోటి రూపాయల ఆస్తి బుగ్గి!
హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న సుమిత్ టింబర్ డిపోతో పాటు బి.డి. ప్లైవుడ్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. టింబర్ డిపోలోని చెక్క దుంగలకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం మొదలైంది. చూస్తుండగానే మంటలు పక్కనే ఉన్న కట్టెలు, ప్లైవుడ్ షీట్లకు వేగంగా వ్యాపించాయి. లోపల ఉన్న కార్మికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అవి అదుపులోకి రాకపోవడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఆకాశమంత ఎత్తుకు ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ జోన్ ఏసీపీ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో స్పందించడం వల్ల మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు.
ప్రాథమిక అంచనా ప్రకారం ఈ ప్రమాదంలో సుమారు రూ. కోటి వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, ఈ గోదాముల నిర్వహణలో కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాటేదాన్ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతుండటంతో, అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నారు.