హైదరాబాద్ నగర శివారులో నకిలీ లిక్కర్ తయారీ దందా వెలుగులోకి వచ్చింది. స్పిరిట్‌తో లిక్కర్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. హైదరాబాద్ నగర శివారులోని కృష్ణ పద్మ అనే స్పిరిట్ కంపెనీలో ఎస్టిఎఫ్ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కల్తీ లిక్కర్ తయారీ వెలుగులోకి వచ్చింది. ముఠా చీప్ లిక్కర్ తో కాస్ట్లీ లిక్కర్ ని తయారు చేసి అమ్ముతున్నట్టు ఎస్టీఎఫ్ గుర్తించింది. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో లిక్కర్ తయారీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో సీసాలు, క్యాప్ లు స్వాధీనం చేసుకున్నారు. తోట శివకుమార్, మల్లికార్జున్ అనే ఇద్దర్ని ఎస్టిఎఫ్ అధికారులు అరెస్టు చేశారు.
ఈ ఇద్దరు నిందితులు స్పిరిట్ తో తయారు చేసిన లిక్కర్‌ను ప్రముఖ బ్రాండ్ లేబుల్స్ వేసి విక్రయాలు జరుపుతున్నారు. విస్కీ తోపాటు వైన్ కంపెనీల బ్రాండ్ వేసి అమ్మకాలు జోరుగా సాగిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. తయారు చేసిన నకిలీ లిక్కర్‌ని గ్రామాల్లో ఉండే షాపులకు విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. నకిలీ లిక్కర్ తయారీ దందా వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి నకిలీ లిక్కర్ తయారీ యూనిట్ల గురించి తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.