Hyderabad: క్యూనెట్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు.. 20 మంది నిందితుల గుర్తింపు

హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) మోసాలపై పోలీసులు కొరడా ఝుళిపించారు.

By -  అంజి
Published on : 23 March 2026 12:34 PM IST

QNet Fraud Case, MLM Scam Hyderabad, CCS Raids, Multi-Level Marketing Fraud, Telangana Police Crackdown, Financial Irregularities, QNet Investigation, Hyderabad Crime News, 25 Locations Raid

Hyderabad: క్యూనెట్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు.. 20 మంది నిందితుల గుర్తింపు

హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) మోసాలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. వివాదాస్పద సంస్థ క్యూనెట్ (QNet) కార్యకలాపాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని దాదాపు 25 ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు నగరాల్లోని ప్రధాన కార్యాలయాలు, అనుమానితుల నివాసాలపై పోలీసులు దాడులు చేశారు. కేవలం హైదరాబాద్‌లోనే ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్ కోసం మొత్తం 25 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే 20 మందిని నిందితులుగా గుర్తించారు. దర్యాప్తు పురోగతిని బట్టి వీరిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో అమాయక ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.

కొత్త కేసులతో మొదలైన వేట

ఇటీవల క్యూనెట్ కార్యకలాపాలపై రెండు కొత్త కేసులు నమోదు కావడంతో పోలీసులు ఈ మెరుపు దాడులకు ప్లాన్ చేశారు. వీటితో కలిపి హైదరాబాద్ సీసీఎస్ పరిధిలో క్యూనెట్‌పై మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ ముసుగులో ఈ సంస్థ ఒక భారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, భారీ ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు ఇన్వెస్టిగేషన్ టీమ్ అనుమానిస్తోంది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. డిజిటల్ ఆధారాలు, కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత ఈ స్కామ్ వెనుక ఉన్న మరిన్ని కీలక సూత్రధారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Next Story