హైదరాబాద్‌లో 2,500 మంది డాక్టర్ల లైసెన్స్‌లు ఎక్స్‌పైరీ.. ఆడిట్‌లో వెలుగులోకి సంచలన విషయాలు

హైదరాబాద్: నగరంలో వైద్య సేవల పేరిట జరుగుతున్న ఉల్లంఘనలను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఆడిట్ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది.

By -  అంజి
Published on : 21 Feb 2026 9:36 AM IST

Hyderabad Medical Audit, Telangana Medical Council (TMC), Harichandana Dasari IAS, Fake Doctors Crackdown, MBBS License Renewal, GO 229 Telangana, Healthcare Accountability

హైదరాబాద్‌లో 2,500 మంది డాక్టర్ల లైసెన్స్‌లు ఎక్స్‌పైరీ.. ఆడిట్‌లో వెలుగులోకి సంచలన విషయాలు

హైదరాబాద్: నగరంలో వైద్య సేవల పేరిట జరుగుతున్న ఉల్లంఘనలను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఆడిట్ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. సుమారు 1,200 నుండి 2,500 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో నమోదు చేసుకోలేదని లేదా తమ లైసెన్స్‌లను పునరుద్ధరించుకోలేదని అధికారులు గుర్తించారు.

హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి ఆదేశాల మేరకు గతేడాది ఆగస్టు 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు (ఆరు నెలల పాటు) సుమారు 4,000 క్లినిక్‌లు, ఆసుపత్రులలో ఈ ఆడిట్ నిర్వహించారు. హైదరాబాద్/సికింద్రాబాద్ పరిధిలో 224 సంస్థలు నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మరో 26 ఉల్లంఘనలను గుర్తించారు.

ఎటువంటి అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తున్న నకిలీలను గుర్తించారు. వీరిపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది. అలాగే ఎంబీబీఎస్ లేదా ఎండీ డిగ్రీలు ఉన్నప్పటికీ, గత ఐదేళ్లుగా రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకోకుండా వైద్యం చేస్తున్న వారిని గుర్తించి వారికి 'షోకాజ్' నోటీసులు జారీ చేశారు. కేవలం అల్లోపతి మాత్రమే కాకుండా ఆయుష్ సెంటర్లు, డెంటల్ క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లలో కూడా మౌలిక సదుపాయాలు, సిబ్బంది అర్హతలను తనిఖీ చేశారు.

కఠిన చర్యలు:

నిబంధనలు ఉల్లంఘించిన క్లినిక్‌లను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు. వీరికి ఏడు రోజుల గడువు ఇచ్చారు. ఈ లోగా తమ లైసెన్స్‌లను పునరుద్ధరించుకుని, తగిన ఆధారాలు చూపిస్తేనే క్లినిక్‌లను తిరిగి తెరుచుకోవడానికి అనుమతిస్తారు. లేనిపక్షంలో జరిమానాతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎందుకు ఈ రిజిస్ట్రేషన్ ముఖ్యం?

తెలంగాణలో మొత్తం 45,000 మంది డాక్టర్లు ఉండగా, కేవలం హైదరాబాద్‌లోనే 18,000 మంది ఉన్నారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను ఆసుపత్రిలో ప్రదర్శించడం వల్ల రోగులకు తను సరైన డాక్టరు వద్దే వైద్యం చేయించుకుంటున్నాననే నమ్మకం కలుగుతుంది. ఇది నకిలీ డాక్టర్లను ఏరివేసేందుకు ప్రభుత్వానికి ప్రధాన అస్త్రంగా మారుతుంది.

Next Story