భార్య మాట్లాడటం లేదని భర్త ఎంత పనిచేశాడు..!
భార్య పుట్టింటికి వెళ్లి తనతో సరిగ్గా మాట్లాడటం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 19 Jun 2023 10:24 AM ISTభార్య మాట్లాడటం లేదని భర్త ఎంత పనిచేశాడు..!
దంపతుల మధ్య గొడవలు జరగడం సహజం. కానీ.. తరచూ జరిగే గొడవలు ఎక్కడి దారి తీస్తాయో చెప్పలేం. కొందరు విడాకులు తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంటే.. ఇంకొందరు తమ కలిసి బతకలేక భారంగా భావించి ప్రాణాలు తీసుకుంటున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే సర్దుకునే గొడవల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. భార్య పుట్టింటికి వెళ్లి తనతో సరిగ్గా మాట్లాడటం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుర్గా భవానీ నగర్‌కు చెందిన నరసింహకు రెండేళ్ల క్రితం శివాని అనే మహిళతో వివాహం జరిగింది. అయితే.. పెళ్లి జరిగిన కొద్ది రోజుల తర్వాత నుంచి ఏం జరిగిందో ఏమో కానీ.. వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నిత్యం ఇద్దరూ ఏదోక విషయంలో ఘర్షణ పడుతూనే ఉండేవారు. దీంతో.. సదురు మహిళ నరసింహతో గొడవలు పడలేక ఇటీవలే తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లాక శివాని తన భర్తతో కానీ.. అతని కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడలేదు. ఎవరూ ప్రయత్నించినా దూరంగానే ఉంచసాగింది. దీంతో.. నరసింహ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. భార్య తనని వదిలివెళ్లిపోయింది.. తనతో మాట్లాడటం లేదని ఎంతో మదనపడిపోయాడు. ఏం చేసినా తను మళ్లీ తిరిగిరాదనుకున్నాడేమో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో.. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మధ్య గొడవలు జరిగితే కూర్చొని మాట్లాడుకోవాలని.. ఇలా ఆత్మహత్యల వరకు వెళ్లడం సరికాదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.