మూసాపేటలో స్క్రాప్ కుప్పలో పేలుడు.. ఒకరు మృతి
హైదరాబాద్ నగరంలో మంగళవారం నాడు వాహనంలో స్క్రాప్ ఎక్కిస్తుండగా భారీ పేలుడు జరిగింది.
By అంజి Published on 7 March 2023 5:15 PM ISTమూసాపేటలో స్క్రాప్ కుప్పలో పేలుడు.. ఒకరు మృతి (ప్రతీకాత్మకచిత్రం)
హైదరాబాద్ నగరంలో మంగళవారం నాడు వాహనంలో స్క్రాప్ ఎక్కిస్తుండగా భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో 30 ఏళ్ల స్క్రాప్ వ్యాపారి మరణించాడు. మూసాపేట ప్రాంతంలో హెచ్‌పీ రోడ్డులో డీలర్ వాహనంపై స్క్రాప్‌ను అప్‌లోడ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. వ్యక్తి వాహనంపై వస్తువులను అప్‌లోడ్ చేస్తుండగా కెమికల్ టిన్ కంటైనర్ నేలపై పడటంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో మహ్మద్ నజీర్ అనే డీలర్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్ నివాసి. నజీర్ తండ్రి ఇస్లామీల్ స్క్రాప్ కొనేవాడు. పేలుడు సంభవించినప్పుడు నజీర్ వాహనంలో మెటీరియల్‌ను అప్‌లోడ్ చేయడంలో సహాయం చేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లోని ఓ పోలీసు అధికారి తెలిపారు.
నగరంలో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకున్నాయి. జూన్ 12, 2022 న అఫ్జల్‌గంజ్ ప్రాంతంలోని మ్యాన్‌హోల్‌లో రసాయనాలను డంప్ చేస్తున్నప్పుడు ఒకరు మరణించారు, మరొకరు గాయపడ్డారు. గతంలో కూడా ఇలాంటి ఘటనల్లో ఇద్దరు చెత్తను సేకరించే వారు ప్రాణాలు కోల్పోయారు.