Telangana: క్రిమినల్‌ కేసుల డేటా కోసం.. హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ టికెట్‌ ఆశావాహి

బీజేపీ టికెట్‌ ఆశావాహి పంపరి సాయి ప్రసాద్‌పై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన డేటా అందించాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. .

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2023 3:59 AM GMT
Malkajgiri, BJP ticket aspirant, Telangana High Court, criminal cases

Telangana: క్రిమినల్‌ కేసుల డేటా కోసం.. హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ టికెట్‌ ఆశావాహి

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీజేవైఎం జాతీయ కోశాధికారి, ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పంపరి సాయి ప్రసాద్‌పై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన సమాచారం అందించాలని తెలంగాణ హైకోర్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని గురువారం ఆదేశించింది. .

సికింద్రాబాద్‌లోని అల్వాల్‌ గంగపుత్ర కాలనీకి చెందిన పి సాయి ప్రసాద్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై జస్టిస్‌ సివి భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ) ముందు సమర్పించాల్సి ఉంటుందని, దానిని పోలీసు శాఖ అందించాల్సి ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.

అక్టోబరు 25న తాను డీజీపీకి రిప్రజెంటేషన ఇచ్చానని, అది ఇంకా పెండింగ్‌లో ఉందని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో, టికెట్ వచ్చినా నామినేషన్ దాఖలు చేయలేరని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.

సోమవారంలోగా పిటిషనర్‌కు సమాచారం అందించాలని డీజీపీని ఆదేశించిన న్యాయమూర్తి, రిట్ పిటిషన్‌ను నవంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు.

Next Story