లివింగ్ గ్రీన్స్.. ఇంటిపై వ్యవసాయం

Living Greens This Jaipur start-up is cooling homes with rooftop gardens.భారతదేశంలోని చాలా నగరాల్లో.. ముఖ్యంగా మెట్రో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 May 2022 7:43 AM GMT
లివింగ్ గ్రీన్స్.. ఇంటిపై వ్యవసాయం

భారతదేశంలోని చాలా నగరాల్లో.. ముఖ్యంగా మెట్రో నగరాల్లో పచ్చని ప్రదేశాలను రోడ్లను విస్తరించే ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎత్తైన భవనాలను నిర్మించేస్తూ ఉంటారు. నగరంలో ఖాళీ ప్రదేశాలే లేకుండా పోతున్న ఈ కాలంలో.. తిరిగి పచ్చదనం ఎలా తెలియాలి..? పైకప్పు మీద వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది? "లివింగ్ గ్రీన్స్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనేది జైపూర్ ఆధారిత స్టార్టప్. రూఫ్‌టాప్ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఆలోచనతో 2013లో ప్రతీక్ తివారీచే స్థాపించబడిన సంస్థ. మొదటి ఐదు సంవత్సరాలు.. సొంతంగా ఇల్లు ఉన్న వారి మిద్దెలపై ఈ తోటల పెంపకం కోసం పని చేయడంపై కంపెనీ దృష్టి సారించింది.


"ఎవరైనా తమ ఇంటి పైకప్పుపై సేంద్రీయ వ్యవసాయం చేయాలనే ఆసక్తి ఉన్న వాళ్లు మమ్మల్ని సంప్రదించండి. మేము వారికి పోర్టబుల్ ఫార్మింగ్ సిస్టమ్‌ను పంపుతాము, వారే స్వయంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. పోర్టబుల్ ఫార్మింగ్ సిస్టమ్‌లో లీక్ ప్రూఫ్ కంటైనర్, సాయిల్‌లెస్ మీడియం, ఐరన్ ఫ్రేమ్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, సబ్-సర్ఫేస్ డ్రైనేజీ వ్యవస్థ కూడా ఉంటాయి. అంతేకాకుండా సేంద్రీయ స్ప్రేలు, ఎరువులు, కూరగాయల విత్తనాలతో కూడిన ఆర్గానిక్ ఇన్‌పుట్ కిట్‌లు కలిగి ఉంటాయి" అని ప్రతీక్ వివరించారు. ఇంటిపైన ఈ వ్యవస్థను సెటప్ చేసిన తర్వాత.. కావాల్సిన మద్దతు, చిట్కాలను అందించడానికి సబ్జెక్ట్ నిపుణులతో కూడిన వాట్సాప్ గ్రూప్ ఏర్పడుతుంది. పోర్టబుల్ సిస్టమ్ కూరగాయలు పండించడానికి ప్రత్యేకంగా ఉన్నప్పటికీ, బొప్పాయి, దానిమ్మ, అరటి మొదలైన పండ్ల కోసం కూడా ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి.


ఈ వ్యవస్థ కారణంగా రోజువారీ కూరగాయలను పండించుకోవచ్చు. ఇలాంటి వాటి వలన నగరం పచ్చగా మార్చడంలో సహాయపడుతుంది. ఇవి ఇళ్లను కూడా చల్లబరుస్తుంది. "సాధారణంగా, మన ఇల్లు మొదటి లేదా రెండవ అంతస్తులో లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు, పైకప్పును ఖాళీగా ఉంచినట్లయితే, దానిపై ఎండ పడుతూనే ఉంటుంది. పైకప్పుపై వ్యవసాయం చేయడం వలన మిద్దెలపై ఎండ పడడాన్ని తగ్గించడమే కాకుండా ఇంటిని చల్లబరుస్తుంది" అని ప్రతీక్ వివరించారు.


ప్రతీక్ సొంత ఆఫీసు భవనం పైకప్పుపై సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల ఎలా చల్లగా ఉంటుందో వివరించారు. "మాకు ఈ కార్యాలయంలో గత మూడు సంవత్సరాలుగా ఎయిర్ కండీషనర్ ఉంది. కానీ వాస్తవం ఏమిటంటే గత మూడేళ్లలో దీనిని మూడుసార్లు కూడా ఉపయోగించలేదు" అని ప్రతీక్ పంచుకున్నారు. గత సంవత్సరంలో లివింగ్ గ్రీన్స్ సంస్థ పాఠశాలలు, కర్మాగారాలు, ఆసుపత్రులు, మాల్స్ పైన కూడా ఈ వ్యవసాయాన్ని ప్రారంభించింది. "ఒక ఫ్యాక్టరీని ఉదాహరణగా తీసుకోండి. చాలా ఫ్యాక్టరీలు నగరానికి దూరంగా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూరగాయల దుకాణాలు ఉండకపోవచ్చు. కర్మాగారాలు ఎక్కువగా ఫ్లాట్ రూఫ్‌టాప్‌లను కలిగి ఉంటాయి. ఇలాంటి పైకప్పుపై సేంద్రీయ వ్యవసాయాన్నిచేయవచ్చు," అని ప్రతీక్ చెప్పారు.

ప్రస్తుతం, లివింగ్ గ్రీన్స్ భారతదేశంలోని 25 నగరాలకు విస్తరించింది, 4,000 పోర్టబుల్ ఫార్మింగ్ సిస్టమ్స్ ను పంపిణీ చేస్తుంది. 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తోంది. "పట్టణీకరణ ప్రతికూల ప్రభావాలను తిప్పికొట్టడానికి ఇది ఉత్తమ పరిష్కారం. భవనాలను నిర్మించడానికి పచ్చని ప్రాంతాలు కనుమరుగు అవుతూ ఉన్నాయి. అలా చేయడం వలన వచ్చే దుష్ప్రభావాలను తిప్పికొట్టడానికి, పచ్చదనాన్ని తిరిగి తీసుకుని రావడానికి ఈ భవనాలపై తోటలను నిర్మించాలి," ప్రతీక్ తెలిపారు.


కరోనా మహమ్మారి సమయంలో, లివింగ్ గ్రీన్స్ తమ కస్టమర్ల నుండి కొన్ని ఊహించని ప్రయోజనాలను వినింది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ యువకులు సైతం తమ ఇళ్లలో రూఫ్‌టాప్ గార్డెన్‌లను ఏర్పాటు చేయడం గురించి ఆరా తీయడం ప్రారంభించారు. వీటితో తల్లిదండ్రులకు ఎంతో కాలక్షేపం కలుగుతుంది. "మహమ్మారి సమయంలో ఆంక్షల కారణంగా సీనియర్ సిటిజన్లు ఇతరులతో కలిసే అవకాశాన్ని కోల్పోయారు. సేంద్రీయ వ్యవసాయం వారికి ఎంతో కాలక్షేపాన్ని ఇచ్చింది" అని ప్రతీక్ చెప్పారు.

చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా ఆన్‌లైన్ తరగతులకు ఎక్కువ సమయం కంప్యూటర్‌లు/మొబైల్ ఫోన్‌లకు అతుక్కుపోయిన వారి పిల్లలకు కొంచెం శారీరక వ్యాయామాన్ని అందించడం కోసం ఇదే మంచి పరిష్కారమని భావించారు. ప్రభుత్వం కూడా రూఫ్‌టాప్ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని లివింగ్ గ్రీన్స్ కోరుకుంటోంది. భద్రత, కొన్ని సమస్యలు ఉన్న మెట్రో పిల్లర్‌లపై తోటలను సృష్టించే బదులు, ఇలాంటి వ్యవసాయం చేసేలా ఎక్కువ మందిని ప్రభుత్వం ప్రోత్సహించాలి" అని ప్రతీక్ చెప్పారు.


INK@WASH 3.0 (Innovations & New Knowledge in Water, Sanitation and Hygiene) లో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీలలో "లివింగ్ గ్రీన్స్" కూడా ఒకటి. INK@WASH 3.0 హైదరాబాద్ లో మే 2022లో నిర్వహించనున్నారు. INK@WASH తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD), డిపార్ట్‌మెంట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. స్టార్టప్‌లు/ఆవిష్కర్తలు, సలహాదారులు, విద్యాసంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలకు నిధులు సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Next Story