Hyderabad: బిఎన్‌రెడ్డి కాలనీలో చిరుత సంచారం!
ఈ మధ్య కాలంలో అడవిలో ఉండాల్సిన జంతువులు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 24 Aug 2023 9:44 AM GMTHyderabad: బిఎన్‌రెడ్డి కాలనీలో చిరుత సంచారం!
ఈ మధ్య కాలంలో అడవిలో ఉండాల్సిన జంతువులు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. అడవిలో నీళ్లు దొరక్కనో.. లేదంటే ఆహారం దొరక్కనో తెలియదు కానీ ఇళ్ల మధ్యకు వచ్చేస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే మానవులపై దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని బిఎన్ రెడ్డి నగర్ కాలనీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.
బిఎన్‌రెడ్డి నగర్ కాలనీలో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. సాగర్ కాంప్లెక్స్ లో చిరుత సంచరిస్తున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. అఖిల్ అనే బాలుడు సైకిల్ తొక్కుతూ వెళ్తున్న సమయంలో ఒక జంతువును చూశానని చెప్పాడు. దాంతో మరో వ్యక్తి బయటకు వెళ్లి చూడగా అది చిరుత అని గుర్తించానని అంటున్నాడు. ఈ విషయం స్థానికంగా అందరికీ పాకింది. చిరుత సంచరిస్తున్నట్లుగా విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురి అవుతున్నారు. వెంటనే స్థానికులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కు సమాచారాన్ని అందించారు. బిఎన్‌రెడ్డికి చేరుకుని చిరుత సంచారం ఆనవాళ్లు గుర్తించాలని.. చిరుతను బంధించాలని కోరుతున్నారు.
అయితే.. స్థానికుల సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు కూడా స్పందించారు. వనస్థలిపురం సాగర్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఓ చిరుత తిరుగుతోందని తమకు సమాచారం అందిందని తెలిపారు. ఆనవాళ్ల కోసం కూడా వెతికామని చెప్పారు. రాత్రి, ఉదయం పరిశీలించినా చిరుత పులి అడుగు జాడలు దొరకలేదని తెలిపారు. చిరుత 24 గంటల్లో సుమారు 50 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని.. ఇబ్రహీంపట్నం అటవీ వరకూ వెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నామని.. అలాగే బోను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని, అన్ని రకాలుగా అలర్ట్‌గా ఉన్నామని చెప్పారు. పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.