పాతబస్తీలో సందడి.. కనుల పండువగా లాల్ దర్వాజా బోనాలు
హైదరాబాద్ పాతబస్తీలో బోనాల సందడి నెలకొంది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు.
By అంజి Published on 16 July 2023 8:46 AM ISTపాతబస్తీలో సందడి.. కనుల పండువగా లాల్ దర్వాజా బోనాలు
హైదరాబాద్ పాతబస్తీలో బోనాల సందడి నెలకొంది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించారు. అనంతరం తొలి బోనం సమర్పించారు. ఆషాడ మాసం చివరి ఆదివారం కావడంతో మహంకాళికి బోనాలు సమర్పించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా రెండు రోజులపాటు జరుగనున్న జాతరలో ఇవాళ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. రెండో రోజైన సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, డప్పుల వాద్యాలు, నృత్యాలతో పాతబస్తీలో బోనాలు కన్నుల పండువగా మారింది.
ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేయడంతో పాటుగా ప్రాచీన దేవాలయ ఉత్సవాల నిర్వహణకు నిధులు మంజూరుచేసి పండుగ వాతావరణాన్ని మరింత పెంచింది. బోనాల ఉత్సవాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయం, అక్కన్న మాదన్న, జియాగూడ సబ్జీమంది, కార్వాన్ దర్బార్ మైసమ్మ, గోల్కొండ తదితర చారిత్రాత్మకమైన ఆలయాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. అలాగే పాతబస్తీలోని పలుప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానంగా ప్రాచీన దేవాలయల రహదారుల్లో ప్రముఖల రాకపోకలుండటంతో ట్రాఫిక్ ఆంక్షలతో పాటుగా భద్రతావలయాలను రూపొందించారు.
కాకతీయుల పాలనా కాలంలో వర్షాకాలం ప్రారంభంలో గ్రామదేవతలకు బోనం సమర్పించి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే ఆచారం ఉండేది. అంటువ్యాధులు వ్యాపించకుండా అమ్మవారిని శక్తి కొలదిగా పూజించి బోనాలు సమర్పించడం ఆనాటి ఆచారంగా ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆచారం ప్రజల్లో మిళితమై నేటికి జరుగుతోంది. ఇందుకు ఆషాఢ మాస బోనాలు అద్దం పడుతున్నాయి. ఆషాఢ మాసంలో గోల్కొండ కోట (పూర్వ మంగళవరం) లోని జగదాంబ మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైన బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట అమ్మవారి ఆలయం దాటి పైదరాబాద్ పాతబస్తీలోని సింహవాహిని ప్రాచీన దేవాలయాల్లో ఆదివారం, సోమవారం జరిగే బోనాలతో ఆషాఢమాస బోనాలు ముగియనున్నాయి.