లాల్‌దర్వాజ బోనాల ఉత్సవం.. పోలీసుల పటిష్ట బందోబస్తు
హైదరాబాద్‌లో బోనాల సందడి కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 28 July 2024 3:30 AM GMTలాల్‌దర్వాజ బోనాల ఉత్సవం.. పోలీసుల పటిష్ట బందోబస్తు
హైదరాబాద్‌లో బోనాల సందడి కొనసాగుతోంది. బోనాల ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లను చేశారు అధికారులు. ఆషాఢమాసం బోనాల జాతరలో భాగంగా ఆదివారం లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అన్నింటినీ అధికారులు పూర్తి చేశారు. మరోవైపు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పాతబస్తిలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాలి దేవాలయం, మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారి దేవాలయం సహా అన్నిప్రధాన ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు.
ఉదయం నుంచే లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. పెద్ద ఎత్తున బోనాలను సమర్పిస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సహా పలువురు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మరోవైపు పాతబస్తిలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. ఫలక్‌నుమా, చార్మినార్, మీర్‌చౌక్, బహదూర్‌పురాతోపాటూ.. నయాపూల్ నుంచి అక్కన్న మాదన్న ఆలయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు.
బోనాల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. శనివారం జోనల్, డిప్యూటీ కమిషనర్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడిన విషయం తెలిసిందే. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగరంలో బోనాల ఉత్సవాల సందర్భంగా ఆది, సోమవారాల్లో మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ నెల 30వ తేదీ మంగళవారం వైన్స్ యథావిధిగా తిరిగి తెరుచుకుంటాయని వెల్లడించారు.