ఒవైసీ-మిధాని ఫ్లై ఓవ‌ర్‌కు అబ్దుల్ క‌లాం పేరు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

KTR launches APJ Abdul Kalam flyover at Owaisi junction.ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ క‌ష్టాలు తీర‌నున్నాయి. జీహెచ్ఎంసీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Dec 2021 7:20 AM GMT
ఒవైసీ-మిధాని ఫ్లై ఓవ‌ర్‌కు అబ్దుల్ క‌లాం పేరు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ క‌ష్టాలు తీర‌నున్నాయి. మ‌రో ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన ఒవైసీ-మిధాని ఫ్లై ఓవ‌ర్‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, బల్దియా మేయర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎస్​ఆర్​డీపీలో భాగంగా 1.3కిలోమీట‌ర్ల పొడ‌వుతో మూడు వ‌రుస‌ల‌తో ఈ ఫ్లై ఓవ‌ర్‌ను నిర్మించారు. ఇందుకోసం రూ.63 కోట్లను ఖ‌ర్చుచేశారు. ఈ ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రావ‌డంతో మిధాని-డీఎంఆర్ఎల్ కూడ‌ళ్ల మ‌ధ్య వాహ‌నాల ర‌ద్దీ త‌గ్గ‌నుంది. మెహదీపట్నం, చాంద్రాయణగుట్ట, మిధాని నుంచి వచ్చే వాహనదారులు ఈ పైవంతెన ద్వారా మందమల్లమ్మ, సంతోష్‌నగర్, సాగర్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్ ప్రాంతాలకు సునాయాసంగా చేరుకోవచ్చు.

ఫ్లై ఓవ‌ర్‌కు అబ్దుల్ క‌లాం పేరు..

కాగా.. ఒవైసీ-మిధాని ఫ్లై ఓవ‌ర్‌కు భార‌త మాజీ రాష్ట్ర‌పతి ఏపీజే అబ్దుల్ క‌లాం పేరును పెడుతున్న‌ట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. డీఆర్‌డీవోలో ప‌ని చేసిన గొప్ప మ‌నిషి అబ్దుల్ క‌లాంకు ఇదే మా నివాళి అని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో ద‌శాబ్దం పాటు అబ్దుల్ క‌లాం నివాసం ఉన్నార‌న‌న్నారు. ఈ ప్రాంతంలో ఎంతో అవినాభావ సంబంధం ఉన్న క‌లాంకు తెలంగాణ ప్ర‌భుత్వం స‌ముచిత గౌర‌వం క‌ల్పించింద‌ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఫ్లై ఓవ‌ర్ ఏరియ‌ల్ వ్యూ వీడియోని షేర్ చేశారు.

Next Story
Share it