హైదరాబాద్‌లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కిషన్‌రెడ్డి

నగరంలోని యూసుఫ్‌గూడ డివిజన్లో కొన్ని చోట్ల పొంగిపొర్లుతున్న నాలాలను కిషన్‌రెడ్డి పరిశీలించారు.

By Srikanth Gundamalla
Published on : 28 July 2023 4:07 PM IST

Kishan Reddy,  Flood affected,  Hyderabad,

హైదరాబాద్‌లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కిషన్‌రెడ్డి

కొద్ది రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేశాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. నీట మునిగిన ప్రాంతాలను పట్టించుకోవడం లేదంటూ కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని యూసుఫ్‌గూడ డివిజన్లో కొన్ని చోట్ల పొంగిపొర్లుతున్న నాలాలను పరిశీలించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి పర్యటించారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లోని వెంకటగిరి, కృష్ణానగర్‌ ప్రాంతాల్లో పొంగిపొర్లుతున్న నాలాలను ఆయన పరిశీలించారు. కాలనీల్లో ఇంకా నీరు ప్రవహిస్తుండటాన్ని చూశారు. ఆ నీళ్లలోనే నడిచారు. అక్కడ స్థానికులు వరద నీటితో పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు కిషన్‌రెడ్డి. ఆ తర్వాత ఉన్నతాధికారులతో మాట్లాడారు. వర్షాలు ఇంకా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోందని.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఎప్పుడు ఏ సాయం కావాల్సి వచ్చిన వెంటనే చేయాలని సూచించారు. రెండ్రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు మాత్రమే నిర్మించడం కాదు.. బస్తీలను కూడా బాగు చేయాలని చురకలు అంటించారు. హైదరాబాద్‌ నుంచి 80 శాతం నిధులు వస్తున్నా.. కనీసం 8 శాతం నిధులను కూడా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. హైదరాబాద్‌ మహానగరంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. పూడీకలు తీయకపోవడంతో రోడ్లపై మురుగు పారుతోందని.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. హైదరాబాద్‌ అంటే అన్ని ప్రాంతాలు.. హైటెక్‌ సిటీ, మాదాపూర్‌నే కాదు బస్తీల్లో కూడా అభివృద్ధి పనుల చేయాలని చెప్పారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.

Next Story