త‌మ్ముడిపై మ‌రీ ఇంత ప్రేమా..? హెలికాఫ్ట‌ర్ తీసుకువ‌చ్చి మ‌రీ

త‌మ్ముడి పెళ్లి ప‌త్రిక‌ల‌ను ఇచ్చేందుకు ఓ అన్న ఏకంగా హెలికాఫ్ట‌ర్‌ను బుక్ చేశాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2023 1:09 PM IST
marriage Helicopter,Khairatabad Man Booked Helicopter,

పెళ్లి ప‌త్రిక‌ల‌ను పంచేందుకు హెలికాఫ్ట‌ర్


పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ముఖ్య‌మైన‌ది. ఎవ‌రికి ఉన్నంతలో వారు ఈ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకుంటుంటారు. ఒకప్పుడు పెళ్లి ప‌త్రిక‌ల‌ను కాలిన‌డ‌క‌, ఎడ్ల బండ్లు, సైకిళ్ల‌పై వెళ్లి ఇచ్చేవారు. ఇప్పుడు టెక్నాల‌జీ పుణ్య‌మా అని వాట్సాప్‌లో పంపిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ అన్న‌.. త‌మ్ముడిపై ఉన్న ప్రేమ‌ను వైరైటీగా చాటుకున్నాడు. ఏకంగా హెలికాఫ్ట‌ర్ బుక్ చేశాడు. హెలికాఫ్ట‌ర్‌లో వెళ్లి త‌మ్ముడి పెళ్లి ప‌త్రిక‌ల‌ను బంధువుల‌కు ఇస్తున్నాడు.

ఖైరతాబాద్‌కు చెందిన మ‌ధు యాద‌వ్.. దూద్‌వాలా పేరుతో డైరీ ఫామ్‌ను నిర్వ‌హిస్తున్నాడు. ఇత‌డి త‌మ్ముడు చందు యాద‌వ్ పెళ్లి ఈ నెల 9న జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో బంధువుల‌కు పెళ్లి ప‌త్రిక‌లు పంపిణీ చేయ‌డం ప్రారంభిచారు. న‌గ‌రంలోని బంధువులు అంద‌రికి స్వ‌యంగా వెళ్లి ప‌త్రిక‌లు అంద‌జేశాడు.

మ‌ధు యాద‌వ్‌కు ముంబైలోనూ బంధువులు ఉన్నారు. వారికి కూడా స్వ‌యంగా వెళ్లి ప‌త్రిక ఇవ్వాల‌ని బావించాడు. వెంట‌నే ఓ హెలికాఫ్ట‌ర్‌ను అద్దెకు తీసుకున్నాడు. మంగ‌ళ‌వారం హెలికాఫ్ట‌ర్‌లో ముంబైకి వెళ్లి బంధువుల‌కు ప‌త్రిక అందజేశాడు. ఇప్పుడు ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కొరియ‌ర్ ద్వారానో, వాట్సాప్ ద్వారానో పెళ్లి ప‌త్రికలు పంపుతున్న ఈ రోజుల్లో హెలికాఫ్ట‌ర్ ను బుక్ చేసి త‌మ్ముడిపై ఉన్న ప్రేమ‌ను చాటుకున్నాడు. పెళ్లి ప‌త్రిక‌ల‌కే ఇలా ఉంటే.. మ‌రీ పెళ్లిని ఎంత గ్రాండ్ గా చేస్తారేమోన‌ని నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story