Hyderabad: ఖైరతాబాద్ గణేష్ నమూనా విడుదల
'ఒక్కో ఏడాది.. ఒక్కో ఎత్తు, ఒక్కో రూపంలో దర్శనం'.. ఇది ఖైరతాబాద్ గణేష్ స్టైల్. ఖైరతాబాద్ గణేష్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్.
By అంజి Published on 18 Aug 2023 8:39 AM ISTHyderabad: ఖైరతాబాద్ గణేష్ నమూనా విడుదల
'ఒక్కో ఏడాది.. ఒక్కో ఎత్తు, ఒక్కో రూపంలో దర్శనం'.. ఇది ఖైరతాబాద్ గణేష్ స్టైల్. ఖైరతాబాద్ గణేష్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్. నవరాత్రుల్లో ఈ గణేష్‌ని చూసేందుకు భక్తులు తండోపాతండాలుగా తరలి వస్తుంటారు. ఇక ఈ ఏడాది గణేష్ ఉత్సవానికి సమయం దగ్గరపడుతోంది. ఈ సారి ఖైరతాబాద్ గణేశుడు 'శ్రీ దశ మహా విద్యా గణపతి'గా భక్తులను ఆశీర్వదించనున్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ ఏడాది థీమ్‌ను వెల్లడించారు. 63 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా 63 అడుగుల భారీ మట్టి గణేష్ విగ్రహంతో పాటు మరో రెండు మట్టి విగ్రహాలతో కూడిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రధాన గణేష్ విగ్రహానికి కుడివైపున 'శ్రీ వీరభద్ర స్వామి' విగ్రహం ఉంటుంది, ఎడమ వైపున 'శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి' విగ్రహం ఉంటుంది.
ఇక విఘ్నేషుడి మంటపంలోనే సరస్వతీ దేవీ, వరాహ దేవి కొలువై ఉంటారు. నిమజ్జనం రోజు ప్రత్యేకంగా రూపొందించిన వాహనంలో మూడు విగ్రహాలను పెద్ద ఊరేగింపుగా హుస్సేన్‌సాగర్‌కు తీసుకువెళ్లనున్నారు. కాగా గతేడాది 50 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మహా గణపతి పంచముఖ మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిచ్చారు. 1954లో ఖైరతాబాదు కౌన్సిలరుగా ఉన్న సింగరి శంకరయ్య ఈ గణేశ్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించాడు. 1954లో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాలు 60ఏళ్ళు వరకు ఒక్కో అడుగు పెంచుతూ 2014 నుండి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతున్నారు. 2018 నుండి పర్యావరణ అనుకూలమైన బంకమట్టి విగ్రహానికి తయారుచేయడానికి గణేష్ ఉత్సవ కమిటీ అంగీకరించింది.