ఖైరతాబాద్‌ గణేష్ నిమజ్జనంపై కీలక నిర్ణయం..!

Khairatabad Ganesh Utsav committee key decision on Ganesh idol immersion.హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జంపై

By అంజి  Published on  15 Sep 2021 4:59 AM GMT
ఖైరతాబాద్‌ గణేష్ నిమజ్జనంపై కీలక నిర్ణయం..!

హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జంపై ఉత్కంఠ నెలకొన్న క్రమంలో.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సంవత్సరం నుండి మట్టి గణపతిని తయారు చేయాలని నిర్ణయించింది. అలాగే వినాయకుడి నిమజ్జనం సైతం మండపంలోనే చేయనున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేయాలని కమిటీ తీర్మానం చేసింది.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాల నిమజ్జనం వల్ల పర్యావరణ ఇబ్బందులు తలెత్తుండడంతో 70 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేసేందుకు కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. మట్టితో ఏర్పాటు చేసిన గణపతిని నిమజ్జనం చేసేందుకు తరలించడం కష్టం కాబట్టి ప్రతిష్టించిన చోటే నీటితో నిమజ్జనం చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. హస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ప్రభుత్వ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ సీజేఐ ధర్మాసనం గణేష్ నిమజ్జనంపై దాఖలైన పిటిషన్‌ను విచారించనుంది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంపై ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకోనున్నారు.

Next Story
Share it